Telugu Global
National

జమిలీ ఎన్నికలపై లా కమిషన్ కీలక నిర్ణయం!

2024లో జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం లా కమిషన్ కూడా ఒక రిపోర్టు తయారు చేయాల్సి ఉన్నది.

జమిలీ ఎన్నికలపై లా కమిషన్ కీలక నిర్ణయం!
X

ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అనే పేరుతో దేశవ్యాప్తంగా పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల చట్ట సభల ఎన్నికలు ఓకే సారి నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఒక సారి ఈ ప్యానల్ కూడా భేటీ అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు.

ఇక 2024లో జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం లా కమిషన్ కూడా ఒక రిపోర్టు తయారు చేయాల్సి ఉన్నది. ప్రాథమిక అధ్యయనం ప్రకారం జమిలీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. కేంద్రానికి పంపే రిపోర్టు తయారు చేయకపోయినా.. లా కమిషన్ వర్గాలు మాత్రం జమిలీ ఎన్నికల నిర్వహణ కష్టమని చెబుతున్నాయి. ఎన్నికలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నది.

ఒకే దేశం ఒకే ఎన్నికపై లా కమిషన్ ఈ నెల 27న ఢిల్లీలో సమావేశం అయ్యింది. లా కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రీతూరాజ్ అవస్తి నేతృత్వంలో జరిగిన భేటీలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సమావేశం అనంతరం లా కమిషన్ ఒక ప్రకటన చేస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఈ విషయంలో లోతైన అధ్యయనం అవసరమని లా కమిషన్ అభిప్రాయపడింది. అందుకే రిపోర్టును ఫైనలైజ్ చేయలేదని సమాచారం.

ఇక మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8 మంది సభ్యులు కూడా మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఉన్నారు.

First Published:  29 Sept 2023 11:46 AM GMT
Next Story