మోసపూరిత ఎన్‌ఆర్‌ఐ వివాహాలకు అడ్డుకట్ట వేయాలి
ముఖ్యంగా మోసపూరిత ఎన్‌ఆర్‌ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని న్యాయ కమిషన్ గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది.
భారతీయ పౌరులతో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు (ఓసీఐ) చేసుకుంటున్న వివాహాలపై సమగ్రమైన చట్టం తేవాలని న్యాయ కమిషన్ కేంద్రానికి సూచించింది. ఈ వివాహాల్లో మోసాలు పెరుగుతున్నాయని, అది ఆందోళనకరమని తెలిపింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర చట్టం అవసరమని పేర్కొంది. భారతీయులు–ఎన్‌ఆర్‌ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది.
జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని కమిషన్ ‘లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఎన్‌ఆర్, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను ఇటీవలే కేంద్ర న్యాయశాఖకు అందజేసింది. దీనిపై కేంద్రం తీసుకురావాలనుకుంటున్న చట్టం ఈ పెళ్లిళ్లకు సంబంధించిన వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది.
ముఖ్యంగా మోసపూరిత ఎన్‌ఆర్‌ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని న్యాయ కమిషన్ గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచ్చితంగా వెల్లడించేలా పాస్‌పోర్టు చట్టం – 1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్టులో మ్యారేజీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్‌పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని తన నివేదికలో లా కమిషన్ అభిప్రాయపడింది.