Telugu Global
National

RSS కు వ్యతిరేకంగా RDS ఏర్పాటు

RDS ప్రారంభ కార్యక్రమంలో దాదాపు 250 మంది హాజరై కన్నడ, ద్రవిడను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ముఖ్యఅతిథులుగా కవి బంజాగెరె జయప్రకాష్, సినీ రచయిత కవిరాజ్, జగతిక లింగాయత్ మహాసభ జిబి పాటిల్, దళిత మైనారిటీల సేనకు చెందిన ఏజే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

RSS కు వ్యతిరేకంగా RDS ఏర్పాటు
X

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలానికి వ్యతిరేకంగా జనవరి 12న బెంగళూరులో రాష్ట్రీయ ద్రవిడ సంఘం (RDS) ఏర్పడింది. ఈ సంస్థ‌ కర్ణాటకలో ద్రవిడ చైతన్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. జర్నలిస్ట్, స్క్రీన్ రైటర్ అగ్ని శ్రీధర్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈ కార్యక్రమాన్ని ద్రవిడ సిటీ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు అభి గౌడ్ నిర్వహించారు.

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆడిటోరియంలో జరిగిన RDS ప్రారంభ కార్యక్రమంలో దాదాపు 250 మంది హాజరై కన్నడ, ద్రవిడను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ముఖ్యఅతిథులుగా కవి బంజాగెరె జయప్రకాష్, సినీ రచయిత కవిరాజ్, జగతిక లింగాయత్ మహాసభ జిబి పాటిల్, దళిత మైనారిటీల సేనకు చెందిన ఏజే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

“ద్రవిడియన్లు భాషా సమాజం, భాషల ఉమ్మడి సమూహం. ఇది మత, కుల ఆధారిత ప్రజల జాతి కాదు; అనేక తెగలు, కమ్యూనిటీలు దానిలో భాగం. అనేక భాషల శాఖలను సృష్టించి, దేశానికి ఒక గుర్తింపును సృష్టించారు. దీని ఆధారంగానే మనం ద్రవిడని గర్వంగా పిలుచుకుంటున్నాం' అని జయప్రకాశ్‌ అన్నారు.

“వారు (హరప్పా నాగరికత) స్త్రీ దేవతలను, నీటిని, శివుడిని పూజించారు. వారు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. సింధు నాగరికత కాలంలో నివసించిన ప్రజలు తమ‌ సమకాలీనులతో సముద్ర మార్గం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసేది. అక్కడి ప్రజలలో కుల శ్రేణులు ఉండేవని ఆధారాలు లేవు. ఈ ప్రాంతం ప్రజారాజ్యాన్ని స్థాపించిందనే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని జయప్రకాశ్ తెలిపారు.

కుల వ్యవస్థను సృష్టించడానికి ఆర్యులే కారణమని జయప్రకాశ్ అన్నారు. "సుమారు 3,500 సంవత్సరాల క్రితం ఆర్యుల రాకతో, ద్రావిడులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దక్షిణాదికి వలస వచ్చారు. ఆర్యులు కుల వ్యవస్థను స్థాపించారు. శూద్రులు, దళితులు సామాజికంగా బహిష్కరించబడ్డారు. ద్రావిడ సంస్కృతిలో, ప్రతి సమాజానికి పూజారులు ఉండేవారు. కానీ ఆర్య సంస్కృతిలో, పూజారులు ఒకే కులానికి చెందినవారు.'' అని ఆయన అన్నారు.

భారతీయ సంస్కృతి అనేది “వైదిక, ద్రావిడ సంస్కృతుల మిశ్రమం. కానీ వారు [కేంద్ర ప్రభుత్వం] మన సంస్కృతిని, భాషా గుర్తింపును మరచిపోవాలని కోరుతున్నారు. సంస్కృతం, హిందీలు ఈ దేశంలో ప్రధాన భాషలు అని వాళ్లు అంటున్నారు” అని జయప్రకాశ్‌ అన్నారు.

హరప్పా నాగరికతను కొనియాడుతూ పాటిల్, “శ్రామిక వర్గంపై ఎలాంటి దోపిడీ జరగలేదు. ఆర్యుల రాక తర్వాత మాత్రమే శ్రామికవర్గం అపవిత్రంగానూ, పూజారి వర్గం పవిత్రంగానూ పరిగణించబడింది.'' అన్నారు.

12వ శతాబ్దపు లింగాయత్ సంఘ సంస్కర్త, తత్వవేత్త, శివభక్తుడు బసవన్న కుల వివక్షను వ్యతిరేకించడాన్ని ప్రస్తావిస్తూ, పాటిల్ ఇలా అన్నారు, “ఆయన కాలంలో, దళితులు మధ్యాహ్నం సమయంలో మాత్రమే వీధుల్లో నడవవలసి వచ్చేది. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు నేరుగా తలపైకి ఉన్నందున ఆ ఎండవేడికి అగ్రవర్ణాల ప్రజలు బైటికి రారు. అదీకాక దళితుల నీడలు అగ్రవర్ణాల‌ ప్రజల మీద పడవు. బసవన్న ఇలాంటి పద్ధతులను వ్యతిరేకించాడు.మతం పేరుతో దళితులను దోపిడీ చేయవద్దని ప్రజలకు చెప్పాడు.'' అనిపాటిల్ అన్నారు.

లింగాయత్‌లు “శివుడిని ఆరాధించే వారని, అంతే కాక శివుడు ఆయన ఆలయంలో మాత్రమే ఉన్నారని వారు నమ్మరు. ఆయన ప్రతిచోటా ఉన్నాడని నమ్ముతారు. హరప్పా నాగరికత అవశేషాలలో ఒక లింగం కనుగొనబడింది. అందుకే ఈ రోజు నన్ను నేను ద్రావిడనని చెప్పుకుంటున్నాను.'' అన్నారు పాటిల్

తమిళనాడు తరహాలో కర్నాటకలో ద్రవిడ ఉద్యమం జరగాలని ఈ సమావేశంలో పలువురు వక్తలు ఆకాంక్షించారు. ముస్లింలపై హిందీ ప్రయోగాన్ని, దేశంపై ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను రుద్దడాన్ని ఖండించారు. చాలా మంది ముస్లింలు ఆర్డీఎస్‌తో అనుబంధం కలిగి ఉన్నారని, వారి పేర్లతో ‘ద్రవిడియన్’ అనే పదాన్ని చేర్చుకున్నారని శ్రీధర్ చెప్పారు.

First Published:  15 Jan 2023 7:16 AM IST
Next Story