Telugu Global
National

మహారాష్ట్ర పరిణామం.. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే వ్యూహం

2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర సైతం కీలక రాష్ట్రం. ఉత్తరప్రదేశ్‌ తరువాత ఎక్కువ ఎంపీ స్థానాలున్నది మహారాష్ట్రలోనే. ఈ రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం బీజేపీకి అవసరం.

మహారాష్ట్ర పరిణామం.. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే వ్యూహం
X

బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్యతా యత్నాల్లో కీలకపాత్ర పోషిస్తున్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్‌ని వ్యూహాత్మకంగా దెబ్బతీసింది కాషాయ పరివారం. అజిత్‌ పవార్‌ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేర‌డంతో ఎన్సీపీ భవితవ్యమే ప్రశ్నార్థకమైంది. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో చూశానంటున్న శరద్‌పవార్‌కు తాజా పరిణామం తీరని దెబ్బ. ఆయన నాయకత్వానికి కఠిన పరీక్ష. ఇప్పటికే ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది అజిత్‌పవార్‌ వైపు చేరిపోయారు. అసలైన ఎన్సీపీ తమదేనంటున్న అజిత్‌ వర్గం వైపు ఎన్నికల సంఘం మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాల తరువాత భిన్న పరిణామాల మధ్య శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది బీజేపీకి, ప్రత్యేకించి నరేంద్ర మోదీ, అమిత్ షాలకు మింగుడు పడని వ్యవహారం. కనుకనే మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చీలిక తెచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కాషాయ పరివారపు కుటిల వ్యూహాలు ఫలించాయి. శివసేనను కనుమరుగు చేసే కుట్రతోనే బీజేపీ ఆగిపోలేదు. అవినీతి కేసుల్లో తలమునకలై వుండి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాస్తున్న అజిత్‌పవార్‌ను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ నేతలు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. వారి ప్రయత్నాల ఫలితమే తాజా పరిణామం. శరద్‌పవార్‌ను కాదని అజిత్‌ పవార్ బీజేపీతో జత కట్టారు. ఉప ముఖ్యమంత్రి పదవిని సాధించుకున్నారు. దీనితో శరద్‌పవార్‌ నాయకత్వంలోని ఎన్సీపీ నష్టపోవడం ఓ ముఖ్య పరిణామం. ఇది అన్నివిధాలుగా బీజేపీకి లాభం చేకూర్చిన‌ రాజకీయ వ్యూహం.

ఎందుకంటే.. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర సైతం కీలక రాష్ట్రం. ఉత్తరప్రదేశ్‌ తరువాత ఎక్కువ ఎంపీ స్థానాలున్నది మహారాష్ట్రలోనే. ఈ రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం బీజేపీకి అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకునే అజిత్‌పవార్‌ వర్గాన్ని తమ వైపు తిప్పుకునే వ్యూహాన్ని అమలు చేసింది బీజేపీ అగ్రనాయకత్వం. అందునా బీజేపీని గద్దె దింపే లక్ష్యంతో ప్రతిపక్షాలు చురుకుగా పనిచేస్తున్న సమయంలో అదును చూసి ఎన్సీపీని దెబ్బకొట్టింది.

దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై అత్యంత సంపన్నమైన నగరం. సంపద్వంతమైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం వుంది. అందువలన మహారాష్ట్రని తమ గుప్పిట్లోంచి జారిపోకుండా చూసుకోవాలన్నదే బీజేపీ తాపత్రయం. ఎలాంటి విలువలు, సిద్ధాంతాల‌కు ఇక్కడ స్థానం లేదు. అడ్డదారుల్లోనైనా అధికారం దక్కించుకోవాలన్న దుష్ట తలంపుతోనే బీజేపీ నాయకత్వం పాచికలు విసిరింది. అజిత్‌పవార్‌ వర్గం ఆ పాచికలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలలో 82 ఏళ్ల‌ కురువృద్ధుడైన శరద్‌పవార్‌ శకం ముగిసిందనుకోవాలా..? మూడున్నరేళ్లుగా బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలని ప్రజలు నిరసిస్తారా..? ప్రజాతీర్పును కాదని అధికార పగ్గాలను చేజిక్కించుకొన్న బీజేపీని ఓటర్లు తిరస్కరిస్తారా..? అన్నవి అసలు ప్రశ్నలు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గానీ ఈ ప్రశ్నలకు జవాబు లభించదు.

First Published:  3 July 2023 12:48 PM GMT
Next Story