Telugu Global
National

నిర్బంధ ఆస్తుల స్వాధీనం చట్టవిరుద్ధం.. - తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ రాజ్యాంగం తగిన రక్షణ కల్పించిందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.

నిర్బంధ ఆస్తుల స్వాధీనం చట్టవిరుద్ధం.. - తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
X

ఇష్టారాజ్యంగా చేపట్టే నిర్బంధ ఆస్తుల స్వాధీనం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కోల్‌కతాలో పార్కు నిర్మాణం కోసమంటూ స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుంది. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా ఆస్తి స్వాధీనం చెల్లదంటూ తీర్పు వెలువడింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ దానిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. చట్టప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నష్టపరిహారం చెల్లించినప్పటికీ ఆస్తి స్వాధీనంలో సరైన పద్ధతులు పాటించలేదంటూ దీనిపై గురువారం తీర్పు వెలువరించిన సందర్భంగా ధర్మాసనం తెలిపింది.

వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ రాజ్యాంగం తగిన రక్షణ కల్పించిందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. నిర్బంధ స్వాధీనాలు, హడావుడి నిర్ణయాలు, న్యాయబద్ధంగా లేని పరిహారాల కారణంగా పౌరులు నష్టపోవడానికి చట్టం అనుమతించబోదని స్పష్టం చేసింది. ఆస్తి స్వాధీనం విషయాన్ని ముందుగా తెలియజేయడం, తగినంత సమయం ఇవ్వడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిని పరిష్కరించడం, పునరావాసం కల్పించడం, ప్రజోపయోగం కోసమేనని వివరించడం వంటివన్నీ ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని 32 పేజీల తీర్పులో ధర్మాసనం పేర్కొంది.

First Published:  17 May 2024 5:19 AM GMT
Next Story