ఓడిపోయాక విదేశాల్లోనే స్థిరపడాలని మోడీ యోచన.. - లాలూ సెటైర్
ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన ప్రయత్నాలను విపక్ష `ఇండియా` కూటమి అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమని భావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. విదేశాల్లో స్థిరపడేందుకు అనువైన ప్రదేశాలను వెతుకుతున్నారని ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా చేశారు. విపక్షాల ఇండియా (INDIA) కూటమిపై ప్రధాని మోడీ విమర్శలు చేసిన నేపథ్యంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొద్ది రోజుల క్రితం `ఇండియా` కూటమి ఏర్పాటుపై ప్రధాని మాట్లాడుతూ.. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు కొత్త కూటమిని ఏర్పాటు చేశాయని ఆరోపించిన విషయం తెలిసిందే. మోడీ వ్యాఖ్యలకు లాలూ సెటైర్ వేశారు. పిజ్జాలు, మోమోలను ఆస్వాదిస్తూ మోడీ విదేశాల్లోనే విశ్రాంతి తీసుకుంటారని లాలూ తెలిపారు. నెల రోజుల్లో ముంబైలో జరిగే `ఇండియా` కూటమి సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి హాజరవ్వనున్నట్టు లాలూ చెప్పారు.
మణిపూర్ ఘటనకు కేంద్రం బాధ్యత వహించాలని లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన ప్రయత్నాలను విపక్ష `ఇండియా` కూటమి అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. దేశ ఐక్యతను కాపాడేందుకు బీజేపీని ఓడించాలని లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.