Telugu Global
National

లఖింపూర్ ఖేరీ రైతుల హత్య కేసు: ఆశిష్ మిశ్రా పిటిషన్‌పై యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

ఉత్తరప్రదేశ్, లఖింపూర్ ఖేరీలో రైతులపైకి వాహనం నడిపి నలుగురు రైతులను హత్య చేసిన కేసులో తనకు బెయిల్ నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

లఖింపూర్ ఖేరీ రైతుల హత్య కేసు: ఆశిష్ మిశ్రా పిటిషన్‌పై యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు
X

లఖింపూర్ ఖేరీకి సంబంధించి మంగ‌ళ‌వారంనాడు సుప్రీం కోర్టు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. తనకు బెయిల్ నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ, 26 జులైన అత‌ని బెయిల్‌ను హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించింది.

గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతులు నిర‌స‌న తెలుపుతుండ‌గా మిశ్రా కాన్వాయ్ వారిపైకి దూసుకెళ్ళింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు స‌హా ఎనిమిది మంది మ‌ర‌ణించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌నే కారు న‌డిపాడ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై హ‌త్య‌,కుట్ర కేసు న‌మోదు చేసి మిశ్రాను ప్ర‌ధాన నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. మిశ్రా కేంద్ర మంత్రి కుమారుడు. కాగా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఈ బెయిల్ ఆర్డర్‌ను పక్కన పెట్టింది. బాధితుల పక్షానికి తగిన అవకాశం కల్పించిన తర్వాత అతని బెయిల్ పిటిషన్‌ను పునఃపరిశీలించాలని హైకోర్టును ఆదేశించింది. మిశ్రా బెయిల్‌ను రద్దు చేసినందుకు మరణించిన రైతు కుమారుడు జగదీప్ సింగ్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

సరైన నిర్ణయం తీసుకున్నందుకు న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, కేంద్ర మంత్రి కుమారుడైనా కాకపోయినా దోషులను శిక్షించే న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది అన్నారు. మేనెల‌లో లో సహ నిందితులు లవకుష్, అంకిత్ దాస్, సుమిత్ జైస్వాల్, శిశుపాల్ బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించింది.

గ‌తంలోనే , లఖింపూర్ ఖేరీ హింసాకాండపై దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది.

First Published:  6 Sept 2022 4:15 PM IST
Next Story