Telugu Global
National

ఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్‌

రేపు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్‌
X

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం పలువురు నాయకులతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. శనివారం ఢిల్లీలో నిర్వహించనున్న మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియల్లో పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్‌ నేతలతో కలిసి కేటీఆర్‌ పాల్గొననున్నారు. పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ ఆదేశాలతో కేటీఆర్‌ సహా నాయకులు ఢిల్లీకి బయల్దేరారు.

దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టుగా మన్మోహన్ సింగ్ అమోఘమైన సేవలందించారని ఒక ప్రకటనలో కేసీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణకు మన్మోహన్‌ సింగ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆయన కేబినెట్‌లో తాను మంత్రిగా పనిచేశానని, ఆయనతో వ్యక్తిగత అనుబంధమున్నదని గుర్తు చేశారు. ఆయన ఎంతో స్థిత ప్రజ్జత కలిగిన దార్శనికులని తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా ఆయన సహకారం తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తనకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని తెలిపారు.

First Published:  27 Dec 2024 6:09 PM IST
Next Story