Telugu Global
National

తుపాను బాధితులకు తమిళ హీరోల సాయం.. మరి తెలుగు హీరోలు..?

పక్కన ఉన్న కోలీవుడ్ హీరోలు పెద్ద మనసు చేసుకుని స్పందించినా, తెలుగు హీరోలు ఇంకా సైలెంట్ గా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు హీరోలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

తుపాను బాధితులకు తమిళ హీరోల సాయం.. మరి తెలుగు హీరోలు..?
X

మిచౌంగ్ తుపాను బాధితులకు సాయం అందించే విషయంలో తమిళ నటులు పెద్ద మనసు చాటుకున్నారు. కోలీవుడ్‌ స్టార్ హీరోలు సూర్య, కార్తి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తక్షణ సాయం కింద వారు చెరో రూ. 10 లక్షలు కేటాయించారు. తమ అభిమాన సంఘాల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులు, చిన్న పిల్లలకు పాలు, మెడిసిన్స్‌ అందిస్తున్నారు. పరిస్థితి చక్కబడేంత వరకు సాయం చేస్తామని, మరిన్ని నిధులు కేటాయించేందుకు తాము వెనకాడబోమని తెలిపారు కార్తి. మరో హీరో విశాల్‌ కూడా రోడ్డుపైకి వచ్చి తన వంతుగా ప్రజల కోసం సాయం చేస్తున్నారు. అధికారుల తీరుని నిరసిస్తూ ఆయన ట్వీట్లు కూడా పెట్టారు.

మిచౌంగ్ తుపాను తమిళనాడుతోపాటు ఏపీలో కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. కోస్తా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. కరెంటు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరు చేరి, ఆహారం లేక అవస్థలు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిత్యావసరాల పంపిణీ మొదలుపెట్టింది. అయితే తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఇంకా స్పందించలేదు.

వాస్తవానికి తెలుగు సినిమా పరిశ్రమ స్పందిచాల్సిన అవసరం లేదు కానీ, పక్కన ఉన్న కోలీవుడ్ హీరోలు పెద్ద మనసు చేసుకుని స్పందించినా, తెలుగు హీరోలు ఇంకా సైలెంట్ గా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు హీరోలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తమిళ హీరోల పెద్ద మనసు చూసయినా తెలుగు నటీనటులు ముందుకు రావాలంటున్నారు. ఆర్థిక సాయం ప్రకటించకపోయినా, కనీసం తమ అభిమాన సంఘాల వారయినా బాధితుల్ని ఆదుకోవాలని పిలుపునివ్వొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.


First Published:  5 Dec 2023 3:32 PM IST
Next Story