Telugu Global
National

కోల్‌కతా రేప్‌ అండ్ మర్డర్ కేసు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

బాధితురాలి శరీర భాగాల్లో గాయాలను ధృవీకరించారు వైద్యులు. మొత్తం 14 గాయాలైనట్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు.

కోల్‌కతా రేప్‌ అండ్ మర్డర్ కేసు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
X

కోల్‌కతాలోని RG కర్ హాస్పిటల్‌ సెమినార్‌ హాల్‌లో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. గొంతు నొక్కడం వల్లే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. లైంగిక దాడి జరిగినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు.

బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రిపోర్టు తప్పుపట్టింది. కానీ, ఆమె శరీరంలో తెల్లటి జిగటలా ఉన్న ద్రవం ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు వైద్యులు. అయితే ఆ ద్రవం ఏంటనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఎముకలు విరిగాయన్న ప్రచారాన్ని అటాప్సీ రిపోర్టు తిరస్కరించింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది.




బాధితురాలి శరీర భాగాల్లో గాయాలను ధృవీకరించారు వైద్యులు. తల, బుగ్గలు, ముక్కు, కుడి దవడ, గడ్డం, మెడ, ఎడమ చేయి, ఎడమ భుజం, ఎడమ మోకాలు, చీలమండ, జననేంద్రియాలతో పాటు వివిధ శరీరభాగాలపై గాయాలున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం 14 గాయాలైనట్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు.

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్యకు గురైంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. డాక్టర్లు సమ్మెకు దిగారు. ఈ కేసులో ఘటన జరిగిన తర్వాతి రోజు సంజయ్‌ రాయ్ అనే వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే కేసు విచారణను కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు సైతం ఈ కేసును సుమోటోగా తీసుకుంది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.

First Published:  19 Aug 2024 5:42 PM IST
Next Story