Telugu Global
National

మణిపూర్ లో మారణహోమం.. తీరిగ్గా కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..?

ఏకపక్షంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న మణిపూర్ బీజేపీ ప్రభుత్వం.. తీరా 50 మంది చనిపోయాక ఇప్పుడు సమస్యలపై చర్చకు రావాలంటూ గిరిజనుల్ని ఆహ్వానించడమేంటని మండిపడుతున్నారు నెటిజన్లు.

మణిపూర్ లో మారణహోమం.. తీరిగ్గా కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..?
X

మణిపూర్ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 54మంది చనిపోయారు. 200మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు, కేంద్రంపై కూడా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విమర్శలను తట్టుకోలేకపోతోంది కేంద్రం. మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది. తీరిగ్గా కేంద్ర మంత్రులు ఇప్పుడు అల్లర్లపై స్టేట్ మెంట్లిస్తూ కాలం గడుపుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు. మణిపూర్ అల్లర్లు దురదృష్టకరం అంటూనే డిమాండ్లపై చర్చకు రావాలని ఆందోళనకారులకు కేంద్రం సూచించిందన్నారు.

50మంది చనిపోయాక చర్చలా..?

కిషన్ రెడ్డి స్టేట్ మెంట్ పై విమర్శలు వినపడుతున్నాయి. ఏకపక్షంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న మణిపూర్ బీజేపీ ప్రభుత్వం.. తీరా 50మంది చనిపోయాక ఇప్పుడు సమస్యలపై చర్చకు రావాలంటూ గిరిజనుల్ని ఆహ్వానించడమేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. సమస్య తీవ్రత దృష్ట్యా ఈ చర్చలేవో అప్పుడే మొదలుపెట్టి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా అంటున్నారు.

మణిపూర్ లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవనేది అక్కడి మీడియా సమాచారం. అయితే కిషన్ రెడ్డి మాత్రం మణిపూర్‌ లో కర్ఫ్యూ సడలించామని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమీక్షిస్తున్నారని కిషన్‌ రెడ్డి తెలిపారు. త్వరలోనే సాధారణ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. డిమాండ్లపై చర్చలకు రావాలని గిరిజన వర్గాలకు సూచించారు. కేంద్రం స్పందన చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉందని విమర్శలు వినపడుతున్నాయి. మణిపూర్ అల్లర్లకు, ప్రాణ నష్టానికి పూర్తిగా కేంద్రమే బాధ్యత వహించాలంటున్నాయి ప్రతిపక్షాలు.

First Published:  7 May 2023 10:46 AM
Next Story