Telugu Global
National

సోనియా, రాహుల్ సలహా తీసుకోవడంలో సిగ్గు పడను : మల్లిఖార్జున్ ఖర్గే

గాంధీ కుటుంబం సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఎలాంటి సిగ్గు పడనని, అందులో తప్పేముందని మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యానించడం పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది.

సోనియా, రాహుల్ సలహా తీసుకోవడంలో సిగ్గు పడను : మల్లిఖార్జున్ ఖర్గే
X

కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలో ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు తమ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ సపోర్ట్ మల్లిఖార్జున్ ఖర్గేకే ఉన్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి. సోనియా, రాహుల్ ఈ విషయాన్ని బయటకు వెల్లడించకపోయినా.. థరూర్ కంటే ఖర్గేనే తదుపరి అధ్యక్షుడు అయితే బెటర్ అనే ఆలోచనతో ఉన్నారు. మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్నారని తెలిసిన దగ్గర నుంచి ప్రతిపక్ష బీజేపీ విమర్శలు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు అయినా, మల్లిఖార్జున్ ఖర్గే రిమోట్ కంట్రోల్ పాలన చేయాల్సిందేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపనలను ఖర్గేతో సహా రాహుల్ గాంధీ కూడా ఖండించారు. తాను స్వతంత్రంగా పని చేస్తానని ఖర్గే చెప్పుకొచ్చారు.

తాజాగా తాను గాంధీ కుటుంబం సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఎలాంటి సిగ్గు పడనని, అందులో తప్పేముందని మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యానించడం పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. పార్టీకి సంబంధించిన పలు నిర్ణయాలలో గాంధీ-నెహ్రూ కుటుంబాలను నేను కలవను. కానీ కీలక విషయాల్లో వారి సలహాలు, సూచనలు తీసుకోవడానికి వెనుకాడనని చెప్పారు. అందులో సిగ్గు పడాల్సిన విషయం ఏమీ లేదని, ఇదంతా కలిసికట్టుగా చేస్తున్న పనిగా భావించాలని.. నేను వ్యక్తిగా కాకుండా ఓ సంస్థగా పని చేయాలనుకుంటున్నానని ఖర్గే చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికైనా సోనియా గాంధీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం సూచనలు లేకుండా పార్టీ ఎన్నటికీ పని చేయదని చెప్పుకొచ్చారు. ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు తాను తప్పకుండా అమలు చేస్తానని, అధ్యక్షుడు అయిన తర్వాత తాను చేయబోయే తొలి పని ఇదేనని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాను ప్రతీ ఒక్కరి సలహాలు తీసుకుంటానని చెప్పారు. పార్టీలో ఒకరి మాటను మరొకరు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే తన అజెండా ఏమిటో తెలియజేశాను.. అధ్యక్షుడిని అయ్యాక పార్టీ పరంగా పెను మార్పులు తప్పకుండా ఉంటాయని ఖర్గే వెల్లడించారు.

గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. అలాగే అధికార పీఠం దక్కినా కాదనుకున్నారు. సోనియా గాంధీకి మెజార్టీ ఉన్న సమయంలోఆమె తన అధికారాన్ని ఇతరులకు ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం సక్రమంగా నడవడానికి తన వంతు కృషి చేశారు. కానీ, ఇప్పుడు మేము ఎదుర్కుంటున్నవి చాలా చిన్న ఎలక్షన్లు. పార్టీ పదవి కూడా చిన్నదే. అందుకే.. అనుభవం ఉన్న గాంధీ కుటుంబాన్ని సంప్రదించడం తప్పేమీ కాదని ఖర్గే సమర్థించుకున్నారు.

First Published:  14 Oct 2022 9:52 AM IST
Next Story