Telugu Global
National

ఇస్రో కీలక అప్‌డేట్.. విక్రమ్, ప్రజ్ఞాన్‌ల గురించి ఏం చెప్పిందంటే..

తాజాగా చంద్రుడిపై పగటి సమయం ప్రారంభమైంది. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలపడానికి ఇస్రో ప్రయత్నించింది.

ఇస్రో కీలక అప్‌డేట్.. విక్రమ్, ప్రజ్ఞాన్‌ల గురించి ఏం చెప్పిందంటే..
X

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం అయిన సంగతి తెలిసిందే. గత నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. ల్యాండర్ నుంచి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. చంద్రుడి వాతావరణ, నీటి జాడలు, ఖనిజాల గురించి అధ్యయనం చేసింది. ఈ సమాచారాన్ని అంతా ఇస్రో భూకేంద్రానికి పంపించింది.

కాగా, చంద్రుడిపై 14 రోజుల పాటు పగటి సమయం ఉంటుంది. ఆ తర్వాత 14 రోజులు పూర్తిగా రాత్రి ఉంటుంది. సోలార్ చార్జింగ్ సహాయంతో విక్రమ్, ప్రజ్ఞాన్ పని చేయాల్సి ఉంటుంది. 14 రోజుల పాటు చీకటి కమ్ముకొని ఉండటం వల్ల.. బ్యాటరీలు చార్జింగ్ కావు. అందుకే సెప్టెంబర్ 2న రోవర్‌ను, సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపించారు. సెప్టెంబర్ 22న అదృష్టం ఉంటే అవి రెండూ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని.. లేకపోతే శాశ్వతంగా అక్కడ భారత అంబాసిడర్‌లుగా నిలిచి పోతాయని ఇస్రో పేర్కొన్నది.

తాజాగా చంద్రుడిపై పగటి సమయం ప్రారంభమైంది. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలపడానికి ఇస్రో ప్రయత్నించింది. దీనికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. 'విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను తిరగి నిద్రాణ స్థితి నుంచి లేపడానికి అవసరమైన కమ్యునికేషన్‌ను కలపడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతానికి అక్కడి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. వాటితో కాంటాక్ట్ అవడానికి మా ప్రయత్నాలను కొనసాగిస్తాము' అని ఇస్రో ట్వీట్ చేసింది.


First Published:  22 Sept 2023 2:32 PM GMT
Next Story