అతడికి ప్రసవం.. భారత్ లో ఇదే ప్రథమం
Transgender couple in Kerala blessed with baby: జహాద్ బిడ్డకు జన్మనిచ్చి ఒకరకంగా తల్లి అయినా, పెరిగే బిడ్డకు అతడు తండ్రిగానే కనపడతాడు. జియా పావల్ ఆ బిడ్డకు తల్లిగా ఆలనా పాలనా చూసుకుంటుంది.
ఇటీవల ఓ ట్రాన్స్ జెండర్ల జంట తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బేబీ బంప్ తో ఉన్న ‘అతడు’, అతడి వెనక ‘ఆమె’ ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడా సందర్భం రానే వచ్చింది. అతడికి సుఖ ప్రసవం అయింది. గది బయట ఆమె ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యాలు నిజంగానే జంబలకిడి పంబ సినిమాని గుర్తు చేశాయి. ఆ ఫొటోలు ఇప్పుడు మరింత వైరల్ గా మారాయి.
కేరళలోని కొయ్ కోడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల జంటలో భార్యగా ఉన్న జహాద్ ఈరోజు ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. దేశంలోనే ట్రాన్స్ జెండర్ల జంట ఇలా ఓ బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అతడికి గర్భం.. అదెలా సాధ్యం..?
కేరళకు చెందిన జహాద్ పుట్టుకతో అమ్మాయి. జియా పావల్ పుట్టుకతో అబ్బాయి. కానీ వారిద్దరూ లింగమార్పిడికి సిద్ధమయ్యారు. జహాద్ అబ్బాయిగా, జియా పావల్ అమ్మాయిగా మారాలనుకున్నారు. ఆపరేషన్లు చేయించుకున్నారు. హార్మోన్ థెరపీతో పూర్తి స్థాయిలో లింగమార్పిడికి సిద్ధమయ్యారు.
ఆ క్రమంలో వారు తల్లిదండ్రులు కావాలనుకున్నారు. కానీ వారికది సాధ్యం కాదు కాబట్టి పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అమ్మాయిగా ఉన్న జహాద్ హార్మోన్ థెరపీ కంటే ముందే గర్భందాల్చేందుకు సిద్ధమైంది. అప్పటికే ఆమెకు వక్షోజాలు తీసివేశారు. అచ్చు అబ్బాయిలా మారిపోయినా కూడా ఆమెకు గర్భసంచి, రుతుక్రమం అలాగే ఉంది. దీంతో ఆమె గర్భందాల్చింది. ఇప్పుడు సుఖప్రసవం అయింది.
జహాద్ బిడ్డకు జన్మనిచ్చి ఒకరకంగా తల్లి అయినా, పెరిగే బిడ్డకు అతడు తండ్రిగానే కనపడతాడు. జియా పావల్ ఆ బిడ్డకు తల్లిగా ఆలనా పాలనా చూసుకుంటుంది. ఈ విచిత్ర ఘటన పట్ల దేశంలోని ట్రాన్స్ జెండర్ల సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.