Telugu Global
National

అతడు లేదా ఆమె.. ఆ నిర్ణయాధికారం వారిదే..

లింగమార్పడి చేసుకున్న వ్యక్తులను క్రీడా ఈవెంట్లలోకి అనుమతించాలని చెబుతూ తీర్పునిచ్చింది. జస్టిస్ విజి అరుణ్ ఈ తీర్పునిచ్చారు.

అతడు లేదా ఆమె.. ఆ నిర్ణయాధికారం వారిదే..
X

క్రీడా పోటీల్లో పాల్గొనే విషయంలో ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష చూపించొద్దని కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్రీడా పోటీలన్నింటిలో ట్రాన్స్ జెండర్ల విభాగం ఒకటి ఉండాలని, అలా లేనిపక్షంలో ఆయా క్రీడా పోటీల్లో పురుషులు, లేదా స్త్రీల కేటగిరీల్లో దేన్నయినా ఎంపిక చేసుకునే అవకాశం వారికే ఇవ్వాలని స్పష్టం చేసింది. లింగమార్పడి చేసుకున్న వ్యక్తులను క్రీడా ఈవెంట్లలోకి అనుమతించాలని చెబుతూ తీర్పునిచ్చింది. జస్టిస్ విజి అరుణ్ ఈ తీర్పునిచ్చారు.

కేరళకు చెందిన అనామిక అనే ట్రాన్స్ ఉమెన్ కేరళ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. కోజికోడ్ జూడో అసోసియేషన్ జిల్లాస్థాయి జూడో పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేదు. అనామిక, మహిళల కేటగిరీలో పోటీలోకి దిగేందుకు సిద్ధమైంది. కానీ క్రీడా నిర్వాహకులు ఆమెను అనుమతించలేదు. ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేదని చెప్పారు. అదే సమయంలో మహిళల విభాగంలో ఆమె పోటీ పడటం కుదరదని చెప్పారు. దీంతో ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేకపోవడంతో.. తనను మహిళల కేటగిరీలో అనుమతించాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అనామిక. ఈ పిటిషన్ జస్టిస్ విజి అరుణ్ సింగిల్ జడ్జి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తనను స్త్రీగా గుర్తించాలని కోరుతున్నారని.. ట్రాన్స్‌జెండర్లు పోటీల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయకుంటే.. ఆమె ఎంచుకున్న విభాగంలో పాల్గొనే విధంగా అనుమతించాల్సి ఉంటుందని ఆయన తీర్పునిచ్చారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి, కేరళ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు నోటీసులు జారీ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు అనామికను అనుమతించాలని ఆదేశించారు. హైకోర్టు తీర్పున‌కు లోబడి తాత్కాలికంగా పోటీలో పాల్గొనేందుకు అనుమతించాలని జిల్లా స్థాయి జూడో పోటీ నిర్వాహకులను ఆదేశించింది.

First Published:  30 July 2022 11:43 AM IST
Next Story