Telugu Global
National

జ‌ర్న‌లిస్ట్ ఫోన్‌ సీజ్ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టిన హైకోర్టు

త‌న‌ను వేధించొద్దంటూ పోలీసుల‌ను ఆదేశించాల‌ని ఆయ‌న హైకోర్టును కోరారు. సోదాలు నిర్వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.

జ‌ర్న‌లిస్ట్ ఫోన్‌ సీజ్ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టిన హైకోర్టు
X

పోలీసులు జ‌ర్న‌లిస్టు ఫోన్‌ను సీజ్ చేయ‌డాన్ని కేర‌ళ హైకోర్టు త‌ప్పుప‌ట్టింది. చట్టం నిర్దేశించిన నిబంధనలు అనుసరించకుండా జర్నలిస్టు ఫోన్‌ సీజ్ చేయడానికి వీల్లేదని స్ప‌ష్టం చేసింది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో 'నాలుగో స్తంభం'లో భాగమని.. ఏదైనా కేసులో వారి ఫోన్ అవసరమని భావిస్తే సీఆర్పీసీ నిబంధనలను అనుసరించాలని తెలిపింది.

ఓ యూ ట్యూబ్ న్యూస్‌ ఛాన‌ల్ నిర్వ‌హిస్తున్న కేర‌ళ‌కు చెందిన షాజ‌న్ స్కారియా అనే వ్య‌క్తిపై స్థానిక ఎమ్మెల్యే పీవీ శ్రీ‌నిజిన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అత‌ను ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలతో తన పరువు తీశాడని ఆరోపించాడు. దీంతో షాజ‌న్‌పై ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం కింద కేసు న‌మోదైంది. పోలీసులు విచార‌ణ‌లో భాగంగా షాజ‌న్ కేసుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేక‌పోయినా వేధిస్తున్నారంటూ విశాఖ‌న్ అనే మ‌ల‌యాళ జ‌ర్న‌లిస్టు హైకోర్టును ఆశ్ర‌యించాడు.

విశాఖ‌న్‌కి వార్త‌ల విష‌యంలో షాజ‌న్‌తో కొద్దిపాటి ప‌రిచ‌యం ఉంది. అయితే పోలీసులు విచార‌ణ పేరుతో జూలై 3న త‌న ఇంట్లో అక్ర‌మంగా సోదాలు నిర్వ‌హించార‌ని, భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ త‌న ఫోన్‌ను సీజ్ చేశార‌ని విశాఖ‌న్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. త‌న‌ను వేధించొద్దంటూ పోలీసుల‌ను ఆదేశించాల‌ని ఆయ‌న హైకోర్టును కోరారు. సోదాలు నిర్వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.

తాజాగా ఈ పిటిష‌న్‌ను విచారించిన జస్టిస్ పీవీ కున్హి కృష్ణన్ ఈ కేసులో పోలీసుల తీరును తప్పుపట్టారు. సదరు జర్నలిస్టు నేరంలో భాగస్వామ్యం లేదని.. అలాంటప్పుడు ఫోన్ సీజ్ చేయడం జర్నలిస్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడి ఫోన్ అవసరమని భావిస్తే నిబంధనలు పాటించాలన్నారు. ఫోన్ ను సీజ్ చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పోలీసులు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.

First Published:  11 July 2023 7:41 AM IST
Next Story