Telugu Global
National

యూట్యూబ్ ఛానెళ్లు వద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులెవరూ యూట్యూబ్ ఛానెళ్లు నడపకూడదని తేల్చి చెప్పింది. ఎవరైనా సొంత యూట్యూబ్ ఛానెళ్లు కలిగి ఉంటే, వాటిని కుటుంబ సభ్యుల పేర్లపైకి మార్చుకోవడమో, లేదా అక్కడితో వాటికి ఫుల్ స్టాప్ పెట్టడమో చేయాలని చెప్పింది.

యూట్యూబ్ ఛానెళ్లు వద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్
X

ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు యూట్యూబ్ ఛానెల్ పెట్టకూడదా, అందులో వీడియోలు చేయకూడదా, పోనీ వేరేవాళ్లు పెట్టిన ఛానెల్ కోసం వీడియోల్లో కనిపించకూడదా..? ఇప్పటి వరకూ ఇలాంటి ఆంక్షలేవీ లేవు. కానీ కేరళ ప్రభుత్వం తొలిసారిగా ఈ నిబంధనలు తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు - యూట్యూబ్ ఛానెళ్లు అనే విషయంలో మార్గదర్శకాలు రూపొందించింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులెవరూ యూట్యూబ్ ఛానెళ్లు నడపకూడదని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఎవరైనా సొంత యూట్యూబ్ ఛానెళ్లు కలిగి ఉంటే, వాటిని కుటుంబ సభ్యుల పేర్లపైకి మార్చుకోవడమో, లేదా అక్కడితో వాటికి ఫుల్ స్టాప్ పెట్టడమో చేయాలని చెప్పింది.

అప్పట్లో టిక్ టాక్ మోజులో పడి ఉద్యోగుల్లో కొంతమంది అసలు డ్యూటీలే చేసేవారు కాదు. తమ టిక్ టాక్ వీడియోలను ఎంతమంది చూశారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసుకోవడమే వీరి పని. ప్రైవేటు సంస్థల్లో ఇలాంటి వ్యవహారాలపై వెంటనే చర్యలుంటాయి, యాజమాన్యం చెప్పినట్టు చేయకపోతే ఉద్యోగం ఊడిపోతుందనే భయం కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అలాంటివేవీ ఉండవు కాబట్టి, వీరిని కట్టడి చేసేందుకే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకొస్తున్నాయి. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ పెడుతూ సబ్ స్క్రైబర్స్ ని పెంచుకోవడం ట్రెండ్ గా మారింది. దీంతో చాలామంది ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ఉద్యోగులపైనే ఇప్పుడు కేరళ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది.

గతంలో యూట్యూబ్ ఛానెల్ అంటే అదో పెద్ద ప్రహసనం అనుకునేవారు, ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎవరైనా యూట్యూబ్ ఛానెల్ పెట్టేయొచ్చు. ఏదో ఒక పేరుతో న్యూస్ ఛానెల్ కూడా పెట్టేయొచ్చు. అందుకే కుప్పలు తెప్పలుగా ఇప్పుడు యూట్యూబ్ లో న్యూస్ ఛానెల్స్ పుట్టుకొస్తున్నాయి. వాటికి తోటు వంటలు, కామెడీ కార్యక్రమాలు, టూర్స్ అంట్ ట్రావెల్స్, ఉచిత సలహాలు.. ఇలా రకరకాలుగా యూట్యూబ్ ఛానెల్స్ వస్తున్నాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీటిని అదనపు ఆదాయంగా భావిస్తున్నారు. ఓ దశలో ఉద్యోగంతో వచ్చే జీతం కంటే యూట్యూబ్ లో వచ్చే రెవెన్యూ అధికంగా కనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో ఫస్ట్ ప్రయారిటీ కచ్చితంగా యూట్యూబ్ కే ఇస్తుంటారు. అందుకే కేరళ సర్కారు కొత్త రూల్ తెచ్చింది. ఉద్యోగం కావాలో, యూట్యూబ్ కావాలో తేల్చుకోమని చెప్పేసింది.

First Published:  20 Feb 2023 2:38 AM
Next Story