Telugu Global
National

హిట్లర్‌ పోకడల నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు.. - కేరళ సీఎం పినరయి విజయన్‌

సంఘ్‌ పరివార్‌ శ్రేణుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే రెండు నినాదాలను వాస్తవానికి ముస్లింలు తొలిసారిగా చాటారని విజయన్‌ ఈ సందర్భంగా చెప్పారు.

హిట్లర్‌ పోకడల నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు.. - కేరళ సీఎం పినరయి విజయన్‌
X

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్రంగా స్పందించారు. ముస్లిం పాలకులు సాంస్కృతిక సారథులని, ముస్లిం ఉన్నతాధికారులు ఎందరో దేశ చరిత్ర, స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకున్నారని ఆయన తెలిపారు. వీటిపై ఏమాత్రం అవగాహన లేని సంఘ్ పరివార్ నేతలు ఇక్కడికొచ్చి ‘భారత్‌ మాతాకీ జై’ అని నినదించాలని డిమాండ్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్వాతంత్య్రోద్యమ వేళ దేశాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన జాతీయస్థాయి నినాదాలు పురుడు పోసుకోవడంలో ముస్లింల పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు.

వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నేతృత్వంలో నాలుగు రోజులుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సోమవారం మలప్పురం జిల్లాలో నిర్వహించిన సభలో కేరళ సీఎం విజయన్‌ పాల్గొని ప్రసంగించారు. హిట్లర్‌ నియంతృత్వ పోకడల నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు పురుడు పోసుకున్నాయని విజయన్‌ విమర్శించారు. క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఎంఎస్‌ గోల్వాల్కర్‌ గతంలో ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సంఘ్‌ పరివార్‌ శ్రేణుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే రెండు నినాదాలను వాస్తవానికి ముస్లింలు తొలిసారిగా చాటారని విజయన్‌ ఈ సందర్భంగా చెప్పారు. వాస్తవానికి భారత్‌ మాతాకీ జై, జైహింద్‌ అని నినదించింది ముస్లింలని ఆయన తెలిపారు. ఈ విషయం సంఘ్‌ పరివార్‌కు తెలీదనుకుంటా అంటూ ఎద్దేవా చేశారు. తెలిస్తే ఆ నినాదాలను ఇవ్వడం సంఘ్‌ పరివార్‌ మానుకుంటుందా? అని ప్రశ్నించారు. అజీముల్లా ఖాన్‌ ‘భారత్‌ మాతాకీ జై’ అంటే, ఆబిద్‌ హసన్‌ అనే భారత దూత ’జై హింద్‌’ అని నినదించారని ఆయన తెలిపారు. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తనయుడు దారా షికోహ్‌ సంస్కృతంలో ఉన్న 50 ఉప నిషత్తులను పర్షియన్‌లోకి తర్జుమా చేశారని ఆయన చెప్పారు. అలా భారతీయ రచనలు విశ్వవ్యాప్తమయ్యేలా తనవంతు కృషిచేశారని వివరించారు. ఇవేమీ తెలియని సంఘ్‌ నేతలు భారత్‌లోని ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేయాలని మొండిపట్టు పడుతుంటారని విజయన్‌ మండిపడ్డారు. సీఏఏతో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని మోడీ సర్కార్‌ కుట్ర పన్నిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  26 March 2024 8:26 AM IST
Next Story