Telugu Global
National

రూ. 500 పెట్టి టికెట్ కొన్నాడు.. రూ. 25 కోట్లు గెలిచాడు

తిరువునంతపురంలోని శ్రీవరాహం ప్రాంతంలో నివసించే అనూప్ అనే ఆటో డ్రైవర్ ఓనమ్ లాటరీలో ఏకంగా రూ. 25 కోట్లు గెలుచుకున్నాడు. లాటరీ టికెట్ కొనడానికి రూ. 500కి ఓ యాబై రూపాయలు తక్కువైతే తన కొడుకు పిగ్గీ బ్యాంక్ నుంచి తీసుకున్నాడు.

రూ. 500 పెట్టి టికెట్ కొన్నాడు.. రూ. 25 కోట్లు గెలిచాడు
X

కరోనా లాక్‌డౌన్, పెరుగుతున్న ఇంధన ధరలు ఆ ఆటో డ్రైవర్ జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఇక ఇక్కడే ఉంటే కుటుంబ పోషణ భారం అవుతుందని.. బంధువుల సలహాతో మలేషియా వెళ్లడానికి సిద్ధపడ్డాడు. అక్కడా ఇక్కడా రూ. 3 లక్షలు అప్పు తెచ్చి మలేషియా వెళ్లే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. అయితే గత 10 ఏళ్లుగా ఉన్న లాటరీ పిచ్చితో.. చివరి సారిగా ఓ టికెట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ నిర్ణయమే అతని జీవితాన్ని మార్చేస్తుందని అతడు అనుకోలేదు. కేరళ రాజధాని తిరువునంతపురంలోని శ్రీవరాహం ప్రాంతంలో నివసించే అనూప్ అనే ఆటో డ్రైవర్ ఓనమ్ లాటరీలో ఏకంగా రూ. 25 కోట్లు గెలుచుకున్నాడు. లాటరీ టికెట్ కొనడానికి రూ. 500కి ఓ యాబై రూపాయలు తక్కువైతే తన కొడుకు పిగ్గీ బ్యాంక్ నుంచి తీసుకున్నాడు.

తిరువునంతపురంలోని గణపతి టెంపుల్ సమీపంలో తన బంధువు నిర్వహించే లాటరీ స్టాల్ నుంచి ముందు ఒక టికెట్ కొన్నాడు. తర్వాత ఎందుకో ఆ నెంబర్ నచ్చక.. మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు అదే టికెట్‌కు రూ. 25 కోట్ల బంపర్ ప్రైజ్ లభించింది. ఆదివారం ఉదయం గోర్కీ భవన్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ తీసిన లక్కీ డ్రాలో అతడి టికెట్ భారీ మొత్తాన్ని గెలచుకున్నది. 'మొదట నేను నా టికెట్‌కు లాటరీ వచ్చిందంటే నమ్మలేదు. నా భార్యను మరోసారి చెక్ చేయమని చెప్పాను. నేను కొన్న TJ-750605 టికెట్‌కే లాటరీ వచ్చిందని భార్య కన్ఫార్మ్ చేసింది' అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. లాటరీ టికెట్ కొనడానికి సరిపోయినంత డబ్బు లేకపోవడంతో నా కుమారుడి పిగ్గీ బ్యాంక్ నుంచి తీసుకున్నాను. ఇప్పటికిప్పుడు ఈ డబ్బుతో ఏం చేయాలో ఇంకా ఏమీ ఆలోచించలేదు అని అనూప్ అంటున్నాడు.

కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం ట్యాక్స్, ఏజెంట్ కమీషన్ పోను అనూప్‌కు రూ. 16.25 కోట్ల వరకు అందుతుందని తెలుస్తోంది. తన కుమారుడికి లాటరీ సరైన సమయంలో వచ్చింది. కుటుంబ పోషణ కోసం మలేషియా వెళ్లాలని సిద్ధపడ్డాడు. ఇక ఆ అవసరం ఉండబోదని అనూప్ తండ్రి చెబుతున్నాడు. తనకు 22 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి లాటరీ కొనే అలవాటు ఉందని అనూప్ చెబుతున్నాడు. గతంలో నాకు పెద్దగా అమౌంట్ ఏమీ రాలేదు. ఒక సారి రూ. 5 వేలు గెలుచుకున్నాను. అదే ఇప్పటి వరకు తాను గెలిచిన భారీ మొత్తం అని చెబుతున్నాడు. ఇక విదేశాలకు వెళ్లనని.. ఇక్కడే మంచి ఇల్లు కట్టుకొని.. కుటుంబంతో హాయిగా జీవిస్తానని చెప్పాడు.

కాగా, కేరళలో ఈ సారి ఓనమ్‌కు 66.54 లక్షల లాటరీ టికెట్లు అమ్మారు. గత ఏడాది 54 లక్షలు అమ్మగా.. ఈ సారి అంతకు 11 లక్షలు ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయాయని మంత్రి బాలగోపాల్ చెప్పారు. ఈ సారి సెకెండ్ ప్రైజ్ రూ. 5 కోట్లు అని.. దీంతో పాటు మరో పది మంది రూ. 1 కోటి చొప్పున గెలుచుకున్నట్లు తెలిపారు. ఓనమ్ బంపర్ లాటరీ ద్వారా ఈ ఏడాది కేరళ ప్రభుత్వానికి రూ. 332.74 కోట్లు సమకూరాయి. ఇందులో విజేతల ప్రైజ్ మనీ, ఏజెంట్ల కమీషన్‌కు రూ. 126 కోట్లు ఖర్చు కానున్నది. గత ఏడాది టికెట్ ధర రూ. 300లే ఉండేది. కానీ ఈ సారి దాన్ని రూ. 500 చేశారు.

గత ఓనమ్ పండుగకు కూడా కే. జయపాలన్ అనే ఆటో డ్రైవర్ రూ. 12 కోట్లు గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో భూమి కొనుగోలు చేయడంతో పాటు పిల్లలకు మంచి విద్యను చెప్పిస్తున్నాడు. లాటరీ గెలిచిన తర్వాత కూడా జయపాలన్ ఇంకా ఆటో నడుపుతుండటం విశేషం. కాగా, కేరళ సీపీఎం పార్టీ లాటరీ గెలిచిన విజేతలు ఆ డబ్బును సద్వినియోగం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం.

First Published:  19 Sept 2022 6:51 AM IST
Next Story