Telugu Global
National

ఇకపై కేరళ కాదు.. కేరళం

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని అధికారిక భాషల్లోనూ కేరళ పేరును కేరళంగా సూచించాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు

ఇకపై కేరళ కాదు.. కేరళం
X

కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రం అధికారిక పేరును అన్ని భాషల్లో కేరళంగా మార్చాలని, అన్ని అధికారిక లావాదేవీల్లో కేరళం పేరును ఉపయోగించాలని కోరుతూ ఈ తీర్మానాన్ని రూపొందించారు.

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని అధికారిక భాషల్లోనూ కేరళ పేరును కేరళంగా సూచించాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎలాంటి సవరణలు కోరకుండానే మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో తీర్మానానికి స్పీకర్‌ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే కేరళను మలయాళంలో కేరళంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన భాషల్లోనూ అలాగే వ్యవహరించాలని విజయన్‌ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

ఈ సందర్భంగా మాట్లాడిన పినరయి విజ‌య‌న్‌.. భాషాప్రాతిపదికన 1956 నవంబర్ 1న రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో కేరళను కూడా ఏర్పాటు చేశారని, అప్పటి నుంచి మలయాళంలో రాష్ట్రం పేరును కేరళం అనే పిలిచేవారని గుర్తు చేశారు. రాష్ట్రం పేరును, అన్ని అధికారిక భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరతూ, అందుకు అవసరమైన అన్ని రాజ్యాంగ సవరణలు చేయాలని అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామ‌న్నారు.

కేరళను కేరళంగా అధికారికంగా మార్చాలన్న డిమాండ్ 2016లోనే ఉంది. అయితే అలాంటి ప్రతిపాదన‌ అనేది తమ‌ వద్ద లేదని సీఎం విజయన్‌ అప్పట్లో సమాధానం ఇచ్చారు. కానీ, విజయన్ ప్రభుత్వం మాత్రం పాలనాపరమైన కార్యకలాపాలలో మలయాళానికే ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్ల, లేఖలు అన్ని మలయాళం లోనే జారీ చేస్తోంది.

First Published:  9 Aug 2023 4:55 PM IST
Next Story