ఇది ఢిల్లీతో ఆగదు.. అన్ని రాష్ట్రాల్లోనూ తీసుకొచ్చే అవకాశముంది.. - కేజ్రీవాల్
గ్రూప్-ఏ స్థాయి అధికారుల అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిరంకుశత్వానికి నిదర్శనమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

దేశ రాజధాని పరిధిలోని గ్రూప్-ఏ స్థాయి అధికారుల అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిరంకుశత్వానికి నిదర్శనమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఇది కేవలం ఢిల్లీతో ఆగిపోదని.. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆర్డినెన్సులను తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు.
కేంద్రం తీరు చూస్తుంటే ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని అర్థమవుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం ఢిల్లీ ప్రజలను తక్కువ చేయడమేనని ఆయన చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా మద్దతు కోరుతూ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నానని, ఢిల్లీ ప్రజలు ఎప్పటికీ ఒంటరివాళ్లు కాదని.. 140 కోట్ల మంది ప్రజల మద్దతు వాళ్లకు ఉందని చెప్పారు.