Telugu Global
National

బ్రిటిష్ పాలన కంటే బీజేపీ మరింత ప్రమాదకరం

వారి పాలనతో దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. స్వాతంత్రానికి ముందు భారత్‌ ని పాలించిన బ్రిటిష్‌ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వ పాలనే ఎక్కువ ప్రమాదకరంగా ఉందన్నారు కేజ్రీవాల్.

బ్రిటిష్ పాలన కంటే బీజేపీ మరింత ప్రమాదకరం
X

దేశంలో బీజేపీ మినహా ఇక ఏ పార్టీ మిగలకూడదు అనే ఉద్దేశంతో నియంతృత్వ పోకడలతో మోదీ అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆ అహంకారానికి వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే బీజేపీ కుట్రపూరిత వ్యూహాన్ని తిప్పికొట్టాలన్నారు.

రాహుల్‌ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడం అహంకారపూరిత నియంతృత్వ చర్యగా అభివర్ణించారు కేజ్రీవాల్. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాల గొంతును అణిచివేయలేరని అన్నారు. తాము న్యాయస్థానాలను గౌరవిస్తామని, అయితే అదే సమయంలో ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేయడం మాత్రం ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పారు కేజ్రీవాల్.


పిరికి చర్య..

రాహుల్‌ ని లోక్‌సభ సభ్యత్వం నుంచి తొలగించడం పిరికి చర్య అని మండిపడ్డారు కేజ్రీవాల్. ఈ తీర్పుతో తాము ఏకీభవించబోమన్నారు. ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, వారి పాలనతో దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. స్వాతంత్రానికి ముందు భారత్‌ ని పాలించిన బ్రిటిష్‌ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వ పాలనే ఎక్కువ ప్రమాదకరంగా ఉందన్నారు.

దేశాన్ని నాశనం చేస్తారా..?

ఢిల్లీ అసెంబ్లీలో కూడా కేజ్రీవాల్ మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ సక్సేనా పేరుతో ఢిల్లీ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం, అసలు ఆయా పార్టీలే లేకుండా చేయాలని చూడటం దుర్మార్గం అని అన్నారు.

First Published:  24 March 2023 7:53 PM IST
Next Story