Telugu Global
National

బీజేపీ ఆఫర్ నా వద్దకూ వచ్చింది - కేజ్రీవాల్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆప్‌ తప్పుకుంటే... లిక్కర్ స్కాంలో ఆప్‌ నేతలపై ఉన్న అభియోగాలన్నింటిని ఎత్తివేస్తామని ఆఫర్ ఇచ్చారన్నారు.

బీజేపీ ఆఫర్ నా వద్దకూ వచ్చింది - కేజ్రీవాల్
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో బాంబు పేల్చారు. తనను కూడా ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని వెల్లడించారు. ఆప్‌ను వీడి వస్తే ముఖ్యమంత్రిని చేస్తామంటూ తొలుత మనిష్ సిసొడియాకు ఆఫర్ ఇచ్చారని.. దాన్ని ఆయన తిరస్కరించడంతో ఆ తర్వాత తనకు సందేశం పంపారని చెప్పారు. ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ ఈ విషయాలను కేజ్రీవాల్ వెల్లడించారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆప్‌ తప్పుకుంటే... లిక్కర్ స్కాంలో ఆప్‌ నేతలపై ఉన్న అభియోగాలన్నింటిని ఎత్తివేస్తామని ఆఫర్ ఇచ్చారన్నారు. సత్యేంద్ర జైన్, సిసోడియాపై ఉన్న కేసులను తొలగిస్తామని చెప్పారన్నారు. ఈ ప్రతిపాదన మీ దగ్గరకు ఎవరు తెచ్చారని ప్రశ్నించగా... బీజేపీ నేతలు నేరుగా సంప్రదించరని.. మన స్నేహితులను సంప్రదించి వారి ద్వారా మనకు సమాచారం చేరేలా చేస్తారన్నారు.

గుజరాత్‌లో మారుతున్న పరిణామలతో బీజేపీలో భయం ఏర్పడిందన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోతోందన్నారు. అందుకే ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని కేజ్రీ చెప్పారు. జైన్, సిసోడియాపై ఈడీ, సీబీఐ మోపిన అభియోగాలన్నీ కల్పితమేనన్నారు. గుజరాత్‌లో ఆప్‌ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గతం కంటే కంటే కొద్దిగా ఎక్కువ సీట్లు మాత్రమే గెలుస్తుందన్నారు. బీజేపీ - కాంగ్రెస్ మధ్య పరస్పర అవగాహన ఉందని కూడా ఆరోపించారు. గుజరాత్‌లో ఆప్‌ను కట్టడి చేసేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.

ఇప్పటికే గుజరాత్‌లో ఆప్ రెండో స్థానంలో ఉందని, కాంగ్రెస్ చాలా వెనుకబడిందని.. ఎన్నికల ఫలితాలు రాగానే గుజరాత్‌లో ఆప్‌ నెంబర్ వన్‌ అవుతుందని కేజ్రీవాల్ చెప్పారు.

First Published:  6 Nov 2022 9:09 AM IST
Next Story