Telugu Global
National

'ఇండియా' కూటమిపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది, వీలైతే మంటల్ని మరింత ఎగదోయాలని చూస్తోంది. ఈ దశలో 'ఇండియా' కూటమిపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇండియా కూటమిపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
X

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. అక్కడ డ్రగ్స్ కేసులో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ అరెస్ట్ అయ్యారు. దీంతో కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాజకీయ ప్రతీకార చర్యగా దీన్ని అభివర్ణించారు కాంగ్రెస్ నేతలు. అయితే కాంగ్రెస్, ఆప్ రెండూ 'ఇండియా' కూటమిలో ఉన్నాయి. కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది, వీలైతే మంటల్ని మరింత ఎగదోయాలని చూస్తోంది. ఈ దశలో 'ఇండియా' కూటమిపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఇండియా కూటమితోనే ముందుకు..

ఏది ఏమైనా తాము 'ఇండియా' కూటమితోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు కేజ్రీవాల్‌. 'ఇండియా' కూటమి విషయంలో పూర్తి నిబద్దతతో ఉన్నామన్నారు. 'ఇండియా' కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. డ్రగ్స్ కేసులో నిన్న పంజాబ్‌ పోలీసులు ఒక నేతను అరెస్టు చేశారని తెలిసిందని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తన వద్ద లేవని, పంజాబ్‌ పోలీసులతోనే ఆ విషయం మాట్లాడాలన్నారు. భగవంత్‌ మన్‌ ప్రభుత్వం పంజాబ్ లో నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. ఆప్‌ ప్రభుత్వం డ్రగ్స్‌ సమస్యను ముగించే లక్ష్యంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగా ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. అయినా కూడా తాము 'ఇండియా' కూటమితోనే కలసి వెళ్తామన్నారు.

పంజాబ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ కి, అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధం లేదని చెప్పారు కేజ్రీవాల్. పంజాబ్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పంజాబ్ లో రెండు పార్టీలు విడివిడిగా పోరాటాలు చేస్తున్నా.. అంతిమంగా తమ లక్ష్యం కేంద్రంలోని బీజేపీని ఓడించడమేనని చెప్పారు కేజ్రీవాల్. 'ఇండియా' కూటమిలో బీటలు అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు.


First Published:  29 Sept 2023 11:19 AM GMT
Next Story