Telugu Global
National

ఢిల్లీలో డీజిల్ వాహనాలను నిషేధించిన కేజ్రీవాల్ సర్కార్

రాజధాని నగరంలో డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలు తప్ప.. మిగతా డీజిల్ వాహనాలు నగరంలోకి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో డీజిల్ వాహనాలను నిషేధించిన కేజ్రీవాల్ సర్కార్
X

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతూ ప్రమాదకరస్థాయికి చేరుకుంది. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు, రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు బయటకు రావ‌డానికి కూడా జనం జంకుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మాస్కులు లేకుంటే బయటికి వచ్చే పరిస్థితి లేదు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. దీపావళి సమయంలో బాణసంచా పేల్చేందుకు నిషేధం విధించిన కేజ్రీవాల్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రాజధాని నగరంలో డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలు తప్ప.. మిగతా డీజిల్ వాహనాలు నగరంలోకి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నగరంలోకి వస్తే రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామని ఢిల్లీ రవాణా శాఖ ప్రకటించింది.

బీఎస్ 3 పెట్రోలు, బీఎస్ 4 డీజిల్ వాహనాలకు ఢిల్లీలో ప్రవేశం లేదని తెలిపింది. ప్రజలు నగరంలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడకుండా 1000 సీఎన్ జీ బస్సులను అద్దెకు తీసుకోనున్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీ నగరంలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 472గా నమోదైంది. ఇంత స్థాయిలో ఇండెక్స్ నమోదు కావడం అంటే అత్యంత ప్రమాదకరస్థితిగా చెప్పొచ్చు. అందుకే ఢిల్లీలో జనం బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు.

First Published:  5 Nov 2022 7:05 AM GMT
Next Story