Telugu Global
National

రెజ్లర్లకు కేజ్రీవాల్ మద్దతు, బ్రిజ్ భూషణ్ అత్యంత శక్తివంతుడని వ్యాఖ్య‌

రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై పాల్పడుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కొంత కాలంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ ధర్నా దగ్గరికి వచ్చిన కేజ్రీవాల్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

రెజ్లర్లకు కేజ్రీవాల్ మద్దతు, బ్రిజ్ భూషణ్ అత్యంత శక్తివంతుడని వ్యాఖ్య‌
X

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పరామర్శించారు. వారికి మద్దతుగా తాను చేయగలిగినదంతా చేస్తానని హామీ ఇచ్చారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై పాల్పడుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కొంత కాలంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ ధర్నా దగ్గరికి వచ్చిన కేజ్రీవాల్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్రం రెజ్లర్ల మానవ హక్కులను తుంగలో తొక్కిందని కేజ్రీవాల్ ఆరోపించారు. “ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకుంటున్నాను - కాంగ్రెస్, బిజెపి లేదా ఆప్...ఏ పార్టీకి చెందిన నాయకులైనా, కార్యకర్తలైనా సరే మీమీ పార్టీలను కొద్ది సేపు పక్కన పెట్టి ఇక్కడికి (జంతర్ మంతర్‌కి) రండి... కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను- ధర్నాచేస్తున్న రెజ్లర్ల కు నీరు, ఆహారం, నిద్రించేందుకు పరుపులు రాకుండా మీరు అడ్డుకుంటున్నారు.విద్యుత్ ను కట్ చేశారు దయచేసి అంత కఠినంగా వ్యవహరించవద్దు. ” అన్నారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గురించి కేజ్రీవాల్ మాట్లాడుతూ “ ఆయన ఎంత శక్తువంతుడో అర్దమవుతుంది. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వారం రోజులు పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకుంది ”అన్నారాయన.

ఉద్యమం చేస్తున్న రెజ్లర్లకు అండగా ఉంటామని కేజ్రీవాల్ హామీ ఇస్తూ, ముఖ్యమంత్రి హోదాలో వారికి వీలైనంత సాయం చేస్తానని చెప్పారు. “వీరు మా కుమార్తెలు; ఇలాంటి రోజును చూడటం కోసమేనా మీరు ఈ దేశానికి కీర్తిని తెచ్చారు ”అని ఆయన అన్నారు.

తర్వాత ఒక ట్వీట్‌లో, మాజీ విద్యా మంత్రి మనీష్ సిసోడియాను ప్రస్తావిస్తూ, కేజ్రీవాల్ ప్రధానిని ఉద్దేశించి ... “మోడీ జీ, మీరు పేద పిల్లలకు విద్య బోధించేవారిని జైలులో పెట్టారు. మహిళా క్రీడాకారులను దోపిడీ చేసిన వారిని కౌగిలించుకున్నారు?” అని కామెంట్ చేశారు.

మరో వైపు ఆప్ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి లు రెజ్లర్లకు మద్దతును తెలప‌డానికి వారిని కలిశారు. " ఈ పోరాటాన్ని కొనసాగించడానికి మీకు విద్యుత్ సరఫరా , నీరు, ఆహారం, జనరేటర్ తదితరాలు ఏది అవసరమైనా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుంది " అని అతిషి వారికి చెప్పారు.

First Published:  29 April 2023 4:09 PM GMT
Next Story