Telugu Global
National

ఆటోవాలా ఇంట్లో కేజ్రీవాల్ భోజనం.. అడ్డుకోవాలని చూసిన పోలీసులు

గతంలో పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కూడా ఓ ఆటో డ్రైవర్ ఇలాగే కేజ్రీవాల్ ని తమ ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరారు. ఆయన నేరుగా వారి ఇంటికే వెళ్లిభోజనం చేసి వచ్చారు, కట్ చేస్తే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది.

ఆటోవాలా ఇంట్లో కేజ్రీవాల్ భోజనం.. అడ్డుకోవాలని చూసిన పోలీసులు
X

గుజరాత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్.. అక్కడ పర్యటన, ప్రచారంలో భాగంగా ఓ ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి భోజనం చేస్తానంటూ మాటిచ్చారు. అయితే ఈ మాట నిలబెట్టుకునే క్రమంలో అహ్మదాబాద్ పోలీసులు ఆయనకు అడ్డు తగిలారు. హోటల్ నుంచి ఆటోలో బయలుదేరిన కేజ్రీవాల్ ని అడ్డుకున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటుందని, ఆటోలో కాకుండా కాన్వాయ్ లో వెళ్లాలని సూచించారు. కానీ కేజ్రీవాల్ వినలేదు, చివరకు పోలీసులు ఆయనకు అనుమతిచ్చారు. ఆటోవాలా ఇంటికి అదే ఆటోలో వెళ్లి భోజనం చేసి వచ్చారు. వారి కుటుంబాన్ని కూడా ఢిల్లీకి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరారు కేజ్రీవాల్.

ఆటో సెంటిమెంట్..

గతంలో పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కూడా ఓ ఆటో డ్రైవర్ ఇలాగే కేజ్రీవాల్ ని తమ ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరారు. ఆయన నేరుగా వారి ఇంటికే వెళ్లిభోజనం చేసి వచ్చారు, కట్ చేస్తే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్ లో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయింది. ఆటో డ్రైవర్లతో కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న విక్రమ్ దంతానీ అనే డ్రైవర్.. సభా ముఖంగా కేజ్రీవాల్ ని తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. తన ఆటోలోనే ఇంటికి తీసుకెళ్తానన్నారు. కేజ్రీవాల్ మాటివ్వడంతో ఆయన‌ నేరుగా ఆటోలో కేజ్రీ ఉంటున్న హోటల్ వద్దకు వచ్చారు. పోలీసులు అడ్డుకున్నా.. కేజ్రీవాల్ వారించి ఆటోలోనే విక్రమ్ దంతానీ ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఇప్పుడీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బీజేపీలాంటి భోజనం కాదు..

బీజేపీ నేతలు కూడా చాలా చోట్ల స్థానిక పేదల ఇంటికి వెళ్లి వారితో కలసి భోజనం చేస్తుంటారు. కానీ అక్కడికి ఆల్రడీ ఆ పార్టీ నాయకులు భోజనం పార్శిల్స్ పంపించేస్తుంటారు. అంటే ఆరోజు ఆ పేదవారింటిలో భోజనం చేయరు. బీజేపీ నేతలు పంపించిన పార్శిల్స్ నే వారి పాత్రల్లో పెట్టుకుని భోజ‌నం చేస్తారు. ఇలాంటి జిమ్మిక్కులు చాలానే జరుగుతున్నాయని, కానీ కేజ్రీవాల్ అలాంటి ఫీట్ చేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీకి చురకలంటిస్తున్నారు. ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి వారి భోజనాన్ని ఆరగించారని, అంతే ఆప్యాయంగా వారిని ఢిల్లీలోని తన ఇంటికి రావాలని ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద గుజరాత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఆప్, అక్కడ ప్రచార హోరుని ముమ్మరం చేసింది.

First Published:  13 Sept 2022 1:49 AM GMT
Next Story