Telugu Global
National

గుజ‌రాత్ 'ఆప్' సీఎం అభ్య‌ర్థిగా మాజీ జర్నలిస్టును ప్ర‌క‌టించిన కేజ్రీవాల్‌

గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ జర్నలిస్టు ఇసుదాన్ గాధ్విని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు కేజ్రీవాల్. ఫోన్ల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం ఆప్ తన అభ్యర్థిని ప్రకటించింది.

గుజ‌రాత్ ఆప్ సీఎం అభ్య‌ర్థిగా మాజీ జర్నలిస్టును ప్ర‌క‌టించిన కేజ్రీవాల్‌
X

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ప్రకటించడంతో, పోటీ చేసే రాజకీయ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఓటర్లలో అంచనాలు పెరిగాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 1, డిసెంబర్ 5 న రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8 న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

ఈసారి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ‌ర్సెస్ ఆప్ పార్టీల మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇక్క‌డ కాంగ్రెస్ కంటే కూడా ఆమ్ అద్మీ పార్టీకే ఎక్కువ ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న సందిగ్ధానికి శుక్ర‌వారం తెర‌ప‌డింది.

గుజ‌రాత్ 'ఆప్' నాయ‌కుల్లో ఇసుదాన్ గాధ్వి, గోపాల్ ఇటాలియా మధ్య పోరు నెలకొంది.ఓ ఫోన్ నంబర్‌ను ప్ర‌జ‌ల‌కు షేర్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకోవడానికి పార్టీ శ్రేణులు, ప్రజల అభిప్రాయాన్ని కోరింది ఆమ్ అద్మీ పార్టీ. ఈ నంబర్‌కు, SMS లేదా వాట్సాప్ ద్వారా వారు మ‌ద్ద‌తు సందేశాన్ని పంపవచ్చు. వాయిస్ సందేశంతోపాటు, aapnocm@gmail.comకు ఇమెయిల్ కూడా చేసే అవ‌కాశం క‌ల్పించింది.

'ఆప్' త‌మ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డానికి గ‌తంలో పంజాబ్‌లో కూడా ఇదే విధానాన్ని అమ‌లు చేసింది. ఇలా వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ జర్నలిస్టు ఇసుదాన్ గాధ్వి ఉంటారని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు.

ఎవ‌రీ ఇసుదన్ గాధ్వి?

రాజకీయాల్లోకి రాకముందు, గాధ్వి గుజరాత్‌లో ప్ర‌ముఖ జర్నలిస్ట్. న్యూస్ ఛానెల్ యాంకర్ కూడా. ఓ ఛానెల్లో గాధ్వి 8-9 పీఎం షో ఎంత పాపుల‌ర్ అంటే, ఆ షోను ప్రేక్ష‌కుల‌ డిమాండ్‌పై రాత్రి 9:30 వరకు అరగంట పొడిగించవలసి వచ్చింది. "నాయక్ లేదా విజేత", అని త‌న‌కు తాను ఒక టాగ్‌లైన్ ప్ర‌క‌టించుకున్న జ‌ర్న‌లిస్టు గాధ్వి ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో తన గ‌ళాన్నివినిపించడంలో ప్రసిద్ధి చెందారు. అత‌ని వ‌య‌సు ప్ర‌స్తుతం 40 ఏళ్లు. AAP సీఎంగా ప్ర‌క‌టించ‌బ‌డిన గాధ్వి గుజ‌రాత్ రాష్ట్రంలోని ద్వారకా జిల్లాలోని పిప్లియా గ్రామంలో ఆర్థికంగా బలమైన‌ రైతు కుటుంబానికి చెందినవాడు.

గుజ‌రాత్ రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 48 శాతంగా ఉన్న OBC కి చెందినవాడు.

రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆశ‌యంతో జూలై 1, 2021న మీడియా ఉద్యోగాన్ని విడిచిపెట్టిన గాధ్విని, బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు సంప్ర‌దించి ఆయా పార్టీల్లోకి ఆహ్వానించాయి. కానీ ఆ సమయంలో, గుర‌జాత్ ఆప్ పార్టీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన గోపాల్ ఇటాలియా, ఆ రాష్ట్ర ఇన్‌చార్జి గులాబ్ సింగ్ యాదవ్‌ల ఆహ్వానం మేర‌కు గాధ్వి జూలై 14, 2021న AAPలో చేరాడు.

First Published:  4 Nov 2022 4:17 PM IST
Next Story