Telugu Global
National

తమిళనాడులో 'కేసీఆర్ జాబ్ మేళా'లు

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేరుతో తమిళనాడులో మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలంగాణలో కేసీఆర్ తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణల ఫలితంగా రైతులు ఎంత అద్భుతంగా అభివృద్ది చెందారో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ఈ జాబ్ మేళా లక్ష్యాలలో ఒకటి.

తమిళనాడులో కేసీఆర్ జాబ్ మేళాలు
X

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వ్యవసాయ మున్నేట్ర కజగం (VMK) స్థానిక లయన్స్ క్లబ్, ఇతర సంస్థలతో కలిసి తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేరుతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలంగాణలో కేసీఆర్ తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణల ఫలితంగా రైతులు ఎంత అద్భుతంగా అభివృద్ది చెందారో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ఈ జాబ్ మేళా లక్ష్యాలలో ఒకటి.

తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా వంటి రైతు అనుకూల కార్యక్రమాలను ప్రారంభించాలని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కన్యాకుమారి నుంచి చెన్నై వరకు రైతు మహా పాదయాత్ర చేపట్టేందుకు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్యతో కలిసి, వీఎంకే యోచిస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

తమిళనాడు వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు సదస్సులు, మెగా జాబ్ మేళాలు నిర్వహించాలని నిర్వాహకులు యోచిస్తున్నారు.

"మేము ఇప్పటివరకు కోయంబత్తూరు, నమ్మకల్‌లో యువత కోసం మెగా జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించాము. రాబోయే కొద్ది వారాల్లో ఇతర జిల్లాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. 1,000 మంది అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొన్నారు, వారిలో 800 మంది ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు, " అని దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు అన్నారు.

First Published:  27 Nov 2022 3:20 PM IST
Next Story