Telugu Global
National

ఈడీ అధికారులను ఎదురు ప్రశ్నించిన కవిత... మౌనం వహించిన అధికారులు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తన‌ ప్రమేయం ఉందని ఈడీ ఎలా నిర్ధారించగలద‌ని కవిత ED అధికారులను ప్రశ్నించగా చెప్పడానికి అధికారులు ఇష్టపడలేదని సమాచారం.

ఈడీ అధికారులను ఎదురు ప్రశ్నించిన కవిత... మౌనం వహించిన అధికారులు
X

సోమవారం న్యూఢిల్లీలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల‌ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 11 గంటల పాటు ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో ఎక్కువసేపు ఒంటరిగా ఖాళీగానే ఉంచారని సమాచారం. అలాగే ఈడీ అధికారులను కవిత ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మీరు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నన్ను విచారణ చేస్తున్నది నిజమా కాదా ? ఈ విధంగా ఎంత మంది రాజకీయనాయకులను వేధిస్తారు ? రాజకీయ నాయకులపై పెట్టిన కేసుల్లో మీరు ఎన్నింటిని రుజువు చేయగల్గుతున్నారు ? గతంలో విపక్షంలో ఉండి ఇప్పుడు బీజేపీలో చేరిన సుజనా చౌదరి, హిమంత బిశ్వశర్మ, నారాయణ్‌ రాణె పై ఈడీ పెట్టిన కేసులు ఏమయ్యాయి? నన్ను నిందితురాలిగా భావిస్తున్నారా ? తదితర ప్రశ్నలను ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులపై సంధించినట్టు సమాచారం. కవిత వేసిన ఏ ప్రశ్నకు కూడా ఈడీ అధికారులు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు బీఆరెస్ వర్గాలు చెప్తున్నాయి.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తన‌ ప్రమేయం ఉందని ఈడీ ఎలా నిర్ధారించగలద‌ని కవిత ED అధికారులను ప్రశ్నించగా చెప్పడానికి అధికారులు ఇష్టపడలేదని సమాచారం.

కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు మొత్తం ప్రశ్నోత్తరాల ప్రక్రియ ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఆమె పదేపదే అభ్యర్థించినప్పటికీ, ఈ కేసులో ఆమె ప్రమేయం గురించి ఆధారాలను చూపించడంలో అధికారులు విఫలమయ్యారని తెలుస్తోంది.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే, వేధింపుల్లో భాగంగా ఆమెను ఒంటరిగా గదిలో కూర్చోబెట్టారని బీఆర్‌ఎస్ వర్గాలు ఆరోపించాయి.

సోమవారం జరిగిన 11 గంటల విచారణలో ఈడీ అధికారులు కవితకు 14 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

కవితను, పలువురు నిందితులతో కలిపి విచారిస్తామని ఈడీ అధికారులు ఇంతకుముందు మీడియాకు సమాచారాన్ని లీక్ చేసినప్పటికీ, ఆమెను చాలా గంటల పాటు గదిలో ఒంటరిగా ఉంచారని , ఎవరితోనూ కలిపి విచారించ లేదని తెలుస్తోంది.

ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్న దాదాపు గంట తర్వాత అధికారులు వచ్చినట్లు తెలిసింది.

తన నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో నేర‌పూరితమైన ఆధారాలు దొరికాయా అని కవిత‌ ఈడీ అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. తన ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు అబద్దపు వార్తను మీడియాకు ఎవరు లీక్ చేశారో తెలుసుకోవాలని కవిత ఈడీ అధికారులను కోరినట్లు సమాచారం.

సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన కేసు మార్చి 24న విచారణ జరగాల్సి ఉండగా, తనను ప్రశ్నించడంలో కేంద్ర యంత్రాంగం ఎందుకు తొందరపడుతుందని ఆమె ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా కవిత తనను విచారణకు పిలిపించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏంటో తనకు తెలుసని అధికారుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

First Published:  21 March 2023 2:45 AM
Next Story