Telugu Global
National

తమిళనాడుకి నీళ్లు ఇవ్వొద్దంటూ నేడు బెంగళూరు బంద్..

కర్నాటక జల సంరక్షణ కమిటీ ఈరోజు బెంగళూరు బంద్ కి పిలుపిచ్చింది. అయినా కూడా నీటి విడుదల విషయంలో ముందుకు వెళ్తే ఈనెల 29న మొత్తం కర్నాటక బంద్ చేపట్టాలని నిర్ణయించారు.

తమిళనాడుకి నీళ్లు ఇవ్వొద్దంటూ నేడు బెంగళూరు బంద్..
X

కావేరీ జల వివాదంతో ఈరోజు బెంగళూరు మొత్తం స్తంభించిపోయింది. ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. తమిళనాడుకు కావేరీ జలాలు ఇవ్వొద్దంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఆదేశాలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ కి బీజేపీ, జేడీఎస్, ఆప్ మద్దతు తెలిపాయి.

కర్నాటక, తమిళనాడు మధ్య కావేరీ జలవివాదం మరోసారి రాజుకుంది. తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని కావేరీ బోర్డు ఆదేశించింది. దీనిపై కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు నీరు విడుదల చేయొద్దని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నిరసనలు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం నీటి విడుదలపై ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులు, ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

కర్నాటక మొత్తం బంద్ చేపడతాం..

కర్నాటక జల సంరక్షణ కమిటీ ఈరోజు బెంగళూరు బంద్ కి పిలుపిచ్చింది. అయినా కూడా నీటి విడుదల విషయంలో ముందుకు వెళ్తే ఈనెల 29న మొత్తం కర్నాటక బంద్ చేపట్టాలని నిర్ణయించారు. కావేరీ జలాల వివాదం నేపథ్యంలో ఫ్రీడం పార్క్‌ లో ఆందోళన చేస్తున్న ఓ రైతు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఓసారి స్థానికులు అడ్డుకున్నారు, రెండోసారి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతును అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.

సినీ నటులపై ఒత్తిడి..

కర్నాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదంలో నటీనటులు ఇబ్బంది పడటం అక్కడ ఆనవాయితీ. తమిళనాడు నటులు పొరపాటున నోరు జారితే, వారి సినిమాలకు కర్నాటకలో ఇబ్బంది. కర్నాటక నటులు తమ రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడితే.. వారి సినిమాలను తమిళనాడులో బహిష్కరిస్తారు. అయినా కూడా కన్నడ నటుడు సుదీప్ తమ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. కన్నడ భూమి, నీరు, భాషకు సంబంధించిన అన్ని పోరాటాల్లో నేను మీతోనే ఉంటానంటూ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు సుదీప్. ప్రస్తుతం కర్నాటలో నీటి ఎద్దడి పరిస్థితులున్నాయని.. తమిళనాడుకి నీరు అందిస్తే.. కన్నడ రైతులు నష్టపోతారని అంటున్నారు.


First Published:  26 Sept 2023 2:04 PM IST
Next Story