జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదా పునరుద్ధరణ అసాధ్యం: గులాంనబీ ఆజాద్
జమ్మూ కశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి వివిధ రాజకీయ పక్షాలు ప్రజలను తప్పుదోవపట్తిస్తున్నాయని సీనియర్ రాజకీయ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ ఆరోపించారు. 370 పునరుద్ధరణ ఎప్పటికీ జరగదని ఆయన స్పష్టం చేశారు.
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగదని సీనియర్ రాజకీయ నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడేళ్ల క్రితం జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దు చేసిందని మళ్ళీ దానిని వెనక్కి తీసుకరాలేమని ఆయన స్పష్టం చేశారు.
ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన తన మొదటి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను ప్రజలను తప్పుదోవ పట్టించబోనని చెప్పారు. ప్రత్యేక హోదా పునరుద్ధరించేందుకు పోరాడతామంటూ రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
"గులాం నబీ ఆజాద్ ఎవరినీ తప్పుదోవ పట్టించడు, ఓట్ల కోసం, నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించను. దోపిడీ చేయను. దయచేసి సాధించలేని సమస్యలను రేకెత్తించవద్దు. 370 పునరుద్ధరణ జరగదు. దీనికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి, " అని ఆజాద్ ఆవేశంగా అన్నారు.
ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ తిరోగమిస్తోందని అన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగాలంటే పార్లమెంటులో మెజారిటీ సాధించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అలా మెజారిటీ సాదించి దీనిని పునరుద్ధరించగల పార్టీ భారతదేశంలో లేదని కాంగ్రెస్ మాజీనేత ఆజాద్ అన్నారు. "దోపిడీ, అసత్య రాజకీయాలపై పోరాడటానికి" రాబోయే 10 రోజుల్లో జమ్మూ కశ్మీర్‌లో తన పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.
"దోపిడీ రాజకీయాలు కశ్మీర్‌లో లక్ష మందిని చంపడానికి దారితీశాయి. ఐదు లక్షల మంది పిల్లలను అనాథలుగా మార్చాయి. ఇది ఎంతో కలవరపాటైన విషయం అన్నారు. "తన రాజకీయ అవకాశాలను దెబ్బతీసినప్పటికీ, దోపిడీ, అసత్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి తాను జమ్ముకశ్మీర్ కు వచ్చానని" ఆజాద్ చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు కల్పించిన ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ప్రచారం చేయడానికి ఒప్పందంపై సంతకం చేసిన కాంగ్రెస్‌తో సహా జమ్మూ,కశ్మీర్‌లోని చాలా ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా ఆజాద్ వైఖరి ఉండడం గమనార్హం.
"ఆందోళనలు చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టడం, వారి మరణానికి కారణమవడం మరొక మోసం. ఆజాద్ జీవించి ఉన్నంత కాలం అసత్యానికి వ్యతిరేకంగా పోరాడతాను. మీరు ఈ ఆలోచనను ఆపాలనుకుంటే మీరు నన్ను చంపేయాలని " అని ఆజాద్ అన్నారు. తాను అమలు చేయగలిగిన హామీలనే ఇస్తానని చెప్పారు.
"నేను సీట్లు గెలవడానికి ఉద్వేగభరితమైన నినాదాలు చేయను. రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం మేము పోరాడవలసి ఉంటుంది. దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదు" అని ఆజాద్ అన్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ లో ఆజాద్ మానవ హక్కులు, అభివృద్ది అంశాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బూటకపు ఎన్‌కౌంటర్లను ఎలా అడ్డుకున్నారో, దోషులైన పోలీసు అధికారులను ఎలా శిక్షించారో గుర్తు చేశారు.