Telugu Global
National

మల్టీప్లెక్సులతో కాశ్మీర్లో మళ్ళీ సినిమా కళ!

ఒక తరానికి తరం సినిమా హాలు మొహం చూడకుండా పెరిగారు. సినిమా హాలు ఎలా వుంటుందో వాళ్ళకి తెలీదు, సినిమా హాల్లో సినిమాలు చూసి ఎరుగరు. సినిమా హాల్లో సినిమా చూడాలంటే 300 కిలోమీటర్లు జమ్మూ వరకూ వెళ్ళాలి.

మల్టీప్లెక్సులతో కాశ్మీర్లో మళ్ళీ సినిమా కళ!
X

ఒక తరానికి తరం సినిమా హాలు మొహం చూడకుండా పెరిగారు. సినిమా హాలు ఎలా వుంటుందో వాళ్ళకి తెలీదు, సినిమా హాల్లో సినిమాలు చూసి ఎరుగరు. సినిమా హాల్లో సినిమా చూడాలంటే 300 కిలోమీటర్లు జమ్మూ వరకూ వెళ్ళాలి. గత 30 ఏళ్ళుగా కాశ్మీర్ లో ప్రేక్షకుల దుస్థితి ఇది. డీవీడీలు, పెన్ డ్రైవ్ లు వేసుకుని సినిమాలు చూడాల్సిన పరిస్థితి. ఆ మధ్య ప్రభుత్వం ఇంటర్నెట్ ని నిలిపివేయడంతో ఆన్ లైన్లో కూడా సినిమాలు చూడలేని దురవస్థ. ఇక దీని కంతటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం కాశ్మీర్లో రెండు మల్టీప్లెక్సులు ప్రారంభించింది. ఫుల్వామాలో ఒకటి, సోఫియాన్ లో ఒకటి. రెండూ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలే. ఉగ్రవాదులకీ, భద్రతా దళాలకీ మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే రణ రంగాలే.

ఈ నేపథ్యంలో గత మంగళవారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ రెండు చోట్లలో రెండు ఐనాక్స్ మల్టీప్లెక్సులు ప్రారంభించారు. 'లాల్ సింగ్ చద్దా' ప్రారంభోత్సవ చలన చిత్రంగా ప్రదర్శించారు. 'లాల్ సింగ్ చద్దా' అనగానే ఇటీవల బాయ్ కాట్ గ్యాంగులు గుర్తుకొస్తారు. ఈ గ్యాంగులు 'లాల్ సింగ్ చద్దా' ఆడకుండా చావుదెబ్బ కొట్టి వదిలారు. థియేటర్ల ముందు ఈ సినిమాకి రావద్దని మైకులు పట్టుకుని మరీ హెచ్చరించారు. అలాటిది కాశ్మీర్ లో సైలెంట్ గా వున్నారు. అక్కడ తమ ప్రభుత్వమే ఈ సినిమాని ప్రదర్శిస్తోంది కదా? ప్రభుత్వానికి కూడా కాశ్మీర్లో ప్రధానంగా వుండే ముస్లిం ప్రేక్షకుల్ని మల్టీప్లెక్సులకి ఆకర్షించాల్సిన అవసరముంది కదా? అలాంటప్పుడు అమీర్ ఖాన్ ని ఆలింగనం చేసుకుని 'లాల్ సింగ్ చద్దా' కాకుండా, 'కాశ్మీర్ ఫైల్స్' ని ప్రదర్శిస్తుందా?

మరి ప్రేక్షకులు వచ్చారా? వస్తున్నారా? కరోనా మహమ్మారి తగ్గినా దేశంలో థియేటర్లకి రావడానికి ప్రేక్షకులు గుండెలరజేత బట్టుకుని సందుమొగలోంచి వెళ్ళాలా వద్దా అని ఎలా పొంచి పొంచి చూసే వాళ్ళో, అదే కాశ్మీర్ ప్రేక్షకుల పరిస్థితి. అక్కడిప్పుడు కరోనా లేదు, టెర్రరిస్టులున్నారు. ఈ టెర్రరిస్టులే 30 ఏళ్ళ క్రితం సినిమా హాళ్ళు మూయించేశారు. ఎప్పుడు తెరవడానికి ప్రయత్నించినా దాడులు చేశారు.

మూసివేతల చరిత్ర

1989 ఆగస్ట్ లో, ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ నేతృత్వంలో అంతగా తెలియని మిలిటెంట్ గ్రూపు 'అల్లా టైగర్స్' కాశ్మీర్లో థియేటర్లు, బార్ లు మూసివేయాలని హెచ్చరికని జారీ చేసింది. 'లా షరకేయా వాలా గరాబేయా, ఇస్లామియా, ఇస్లామియా (ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు ఇస్లాం ఈజ్ ది బెస్ట్) అనే 1979 నాటి ఇరాన్ విప్లవ నినాదాన్ని మార్మోగించింది. సినిమాలు ఇస్లాం వ్యతిరేకమని హెచ్చరించింది. స్థానికులు ఖాతరు చేయకపోవడంతో కొన్ని సినిమా హాళ్ళు తగులబెట్టారు. దాంతో డిసెంబర్ కల్లా మిగిలిన సినిమా హాళ్ళు మూసేశారు. మొత్తం లోయలో రీగల్, ఫిర్దౌస్, షీరాజ్, నీలం, బ్రాడ్‌వే, ఖైబర్, సమద్, రెజీనా, షాకర్ మొదలైన 12 సినిమా హాళ్ళు వుండేవి. బాలీవుడ్ సినిమాలు జోరుగా ఆడేవి.

దశాబ్దం తర్వాత 1999లో, ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం- రీగల్, నీలం, బ్రాడ్‌వే థియేటర్లు మూడూ తిరిగి ప్రారంభిస్తే, రీగల్ థియేటర్లో బాంబు దాడికి పాల్పడ్డారు టెర్రరిస్టులు. ఒక ప్రేక్షకుడు మరణించి, 12 మంది గాయపడ్డారు. దీంతో మళ్ళీ మూత బడ్డాయి. ఆ తర్వాత చాలా సినిమా హాళ్ళు షాపింగ్ కాంప్లెక్సులుగా, నర్సింగ్‌హోమ్‌లుగా, పారామిలటరీ బలగాల శిబిరాలుగా మారిపోయాయి.

ఇక సైన్యమే పూనుకుని నాలుగు థియేటర్లని ప్రారంభిస్తూ, వాటికి మాజీ సైనికాధికారుల పేర్లు పెట్టింది. టెర్రరిస్టుల నుంచి తీవ్ర బెదిరింపుల కారణంగా వాటిని మూసేసి కాన్ఫరెన్సు హాళ్ళుగా ఉపయోగించుకో సాగారు. ఇలా స్వయంగా భద్రతా దళాలే అభయమిచ్చినా ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. అలాంటిది ఫుల్వామా, సోఫియాన్ లాంటి హై రిస్కు ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు ప్రారంభిస్తే ప్రేక్షకుల ప్రతిస్పందన అంతంత మాత్రంగానే వుంది. ఇక కుటుంబాలు కదిలివచ్చి సినిమాలు చూసే ప్రసక్తే లేదు.

కాశ్మీర్‌లో అధిక భద్రతా ఏర్పాట్లు వున్నప్పటికీ లక్ష్యిత దాడులు జరుగుతున్నప్పుడు, ఈ మల్టీప్లెక్సులు టెర్రరిస్టులకి సంభావ్య లక్ష్యంగా మారవచ్చని భద్రతా అధికారులలోని ఒక వర్గం భయపడుతోంది. అయినప్పటికీ, అక్కడి సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఇది మంచి మార్పు అని కొనియాడుతున్నారు. సౌదీ అరేబియాలోనే 2017 లో తిరిగి థియేటర్లు తెరిస్తే కాశ్మీర్లో ఎందుకు మతమౌఢ్యమని ఉగ్రవాదుల్ని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదం క్షీణిస్తోందనీ, రాబోయే నెలల్లో కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఎవరూ వుండరనీ అంటున్నారు.

రాజకీయ పక్షాలు సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక వైఖరితో వుంటాయి. వాళ్ళదో వెర్షన్. 'దురదృష్టవశాత్తూ అందరూ ఇక్కడ నటులుగా మారుతున్నారు, అంతా బావున్నట్టు నటిస్తున్నారు. పుల్వామా, సోపియాన్‌లలో ప్రారంభించినవి మల్టీ ప్లెక్సులా? అవి రెండు ఆడిటోరియాలలో ప్రొజెక్టర్‌లు అమర్చిన సమావేశ గదులు. ఇవి ఒక జోకు!' అని పిడిపి ప్రతినిధి కొట్టి పారేశాడు.

పూర్వవైభవం తిరిగొస్తుందా?

కాశ్మీర్‌లో సినిమా చరిత్ర స్వాతంత్ర్య పూర్వమే ప్రారంభమైంది. 1932 లో 'కాశ్మీర్ టాకీస్' పేరుతో మొట్టమొదటి సినిమా హాలుని భాయ్ అనంత్ సింగ్ గౌరీ శ్రీనగర్లో స్థాపించారు. తర్వాత 'పల్లాడియం సినిమా' గా పాశ్చాత్యీ కరణ చేశారు పేరుని. ఇది ఇప్పుడు శిథిలావస్థలో వుంది. ఒక వైపు సినిమా హాళ్ళు పెరుగుతూ, మరోవైపు సినిమా షూటింగులు జరుగుతూ కళావైభవంతో వుండేది కాశ్మీర్. కాశ్మీర్ లో షూటింగ్ చేయని, కనీసం ఒక పాట చిత్రీకరించని హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లేవు. ఈ వైభవం పునరుద్ధరణ కోసం తిరిగి కృషి కూడా ప్రారంభమైంది. ప్రదర్శనా రంగాన్నే కాకుండా నిర్మాణ రంగాన్ని కూడా తిరిగి గాడిలో పెట్టాలని.

కాశ్మీర్ - బాలీవుడ్‌ల మధ్య కొత్త అనుబంధాన్ని ఏర్పరిస్తే స్థానిక కళాకారులకి, ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఎత్తున సహాయకారి అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పాటల షూటింగ్ కోసం దాదాపు 500 ప్రతిపాదనలు ఆమోదం కోసం వేచి వున్నాయి. వీటిలో 120 కి పైగా ప్రతిపాదనలని ఆమోదించారు. నిర్మాతలు ఒక నిర్దిష్ట శాతం స్థానిక కళాకారులని నియమించడం తప్పనిసరని ఒక షరతు పెడుతున్నారు. ఇదివరకు జరుగుతూ వుండిన చలనచిత్రోత్సవాలని కూడా పునరుద్ధరించాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం అనంత్‌నాగ్, శ్రీనగర్, బండిపోరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్త్వార్, రియాసీలలోనూ సినిమా హాళ్ళు త్వరలో ప్రారంభించనున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రేక్షకులు థియేటర్లకి రావాలంటే సాధారణ పరిస్థితులు నెలకొనాలి. దీనికి ప్రభుత్వం మీద చాలా భారం వుంది. కాశ్మీర్ ని ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడం మామూలు విషయం కాదు. మార్చే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరిగితే కాశ్మీర్ కే కాదు, బాలీవుడ్ కే కాదు, దక్షిణ పానిండియా సినిమాలకీ రెవెన్యూ పరంగా కొత్త మార్గాలు తెరచుకుంటాయి. పోరు ఉగ్రవాదంతో ఆర్ధిక వాదంగా మారాలి.

First Published:  22 Sept 2022 12:29 PM IST
Next Story