Telugu Global
National

చివర్లో చిదంబరం ట్విస్ట్.. రాహుల్ మద్దతు ఎవరికంటే.. ?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 9వేలమందికి ఓటు హక్కు ఉంది. అందరూ గెలిచేవారికే ఓటు వేయాలనుకుంటారు. కనీసం కొంతమంది అయినా మార్పు కోరుకుంటే థ‌రూర్ కి ఓట్లు పడే అవకాశం ఉంటుంది.

చివర్లో చిదంబరం ట్విస్ట్.. రాహుల్ మద్దతు ఎవరికంటే.. ?
X

కాంగ్రెస్ అధ్య‌క్ష పదవికోసం పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో గెలుపు అవకాశాలు మల్లికార్జున్ ఖర్గేకే ఉన్నట్టు తేలిపోయింది. కానీ పోటీ మాత్రం అనివార్యం కావడంతో పోలింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దశలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం బహిరంగంగా తన మద్దతు శశిథ‌రూర్ కేనంటూ ప్రకటించారు. ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కీలక నాయకులు ఖర్గేకి స్వాగతం పలికారు కానీ, శశిథ‌రూర్ ని పట్టించుకోలేదు. కానీ తొలిసారిగా థ‌రూర్ కి మద్దతు ఇస్తున్నానంటూ కార్తీ చిదంబరం ప్రకటించడంతో కాస్త కలకలం రేగింది. అంత మాత్రాన ఆయన గెలిచేస్తాడనుకోలేం. అదే సమయంలో థ‌రూర్ కి కూడా కచ్చితంగా గుర్తించుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడతాయని తెలుస్తోంది.

రాహుల్ మద్దతు ఎవరికి.. ?

ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగినా.. అధిష్టానం తరపున బరిలో దిగిన మల్లికార్జున్ ఖర్గేకే గాంధీ కుటుంబం మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. ఇటీవల భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ ని కలసిన ఖర్గే, అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ పరోక్షంగా ఓ సందేశం పంపారు. అయితే గాంధీ కుటుంబం ఎప్పుడూ తమ మద్దతు ఫలానావారికి అంటూ బహిరంగ ప్రకటన చేయలేదు. రాహుల్ కూడా ఎన్నికలపై ఎక్కడా కామెంట్ చేయలేదు. సోనియా, రాహుల్, ప్రియాంక.. ఎవరూ తమ మద్దతు ఫలానా వారికి అని చెప్పలేరని, అది పార్టీ సంప్రదాయం కాదని అంటున్నారు కార్తీ చిదంబరం. ప్రతి ఒక్కరూ తమ మనస్సాక్షితో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

అందరూ మనస్సాక్షి ప్రకారమే ఓటు వేస్తారా.. ?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 9వేలమందికి ఓటు హక్కు ఉంది. అందరూ గెలిచేవారికే ఓటు వేయాలనుకుంటారు. కనీసం కొంతమంది అయినా మార్పు కోరుకుంటే థ‌రూర్‌కి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. సీక్రెట్ ఓటింగ్ అని అనుకున్నా కూడా థ‌రూర్ వైపు మొగ్గు చూపితే చివరకు ఏమవుతుందోననే ఆందోళన అందరిలోనూ ఉంది. కార్తీ చిదంబరం వంటి నేతలు ఎంతమంది ఉంటారనేది కూడా అనుమానమే. తనకిచ్చిన ఓటర్ల లిస్ట్ తప్పుల తడకగా ఉందని, పీసీసీ అధ్యక్షులు తనతో కలవకుండా ఖర్గేని మాత్రమే కలవడం అన్యాయమని ఇప్పటికే థ‌రూర్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోటీనుంచి విరమించుకోకుండా తన ప్రయత్నం తాను చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యవహారం పోలింగ్ ముందు రోజు రసవత్తరంగా మారింది. కార్తీ చిదంబరం వంటి కీలక నేతలు థ‌రూర్ వైపు నిలబడితే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆయనకు ఓట్లు పోలయితే.. కాంగ్రెస్ నాయకులు మార్పు కోరుకుంటున్నట్టే లెక్క.

First Published:  16 Oct 2022 12:20 PM IST
Next Story