Telugu Global
National

క‌ర్ణాట‌క మ‌రో యూపీ లా మార‌నున్న‌దా..!?

కర్నాటక రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లాంటి పాలన కావాలని అక్కడి హిందుత్వ శక్తులు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యల నేపథ్యంలో బుల్డోజర్ల రాజ్యం కావాలని బీజేపీ కార్యకర్తలు తమ నాయకత్వాన్ని అడుగుతున్నారు.

క‌ర్ణాట‌క మ‌రో యూపీ లా మార‌నున్న‌దా..!?
X

రాష్ట్రంలో కొంత‌కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాలు కర్ణాట‌క‌ను మ‌రో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లా మార్చ‌నున్నాయా అనే ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. హిజాబ్ వివాదం, పాఠ్యాంశాలలో మార్పులు, అస‌హ‌నంతో నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై దాడులు చేసి నిలిపివేయ‌డం వంటి సంఘటనలు ఇప్ప‌టికే మేధావుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేశాయి. ఇవి చాల‌వ‌న్న‌ట్టు తాజాగా ఇద్ద‌రు బిజెపి అనుబంధ సంఘాలు, ఆ పార్టీ ఐటి విభాగానికి చెందిన వ్య‌క్తులు హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ నేపథ్యంలో బిజెపి కి చెందిన అన్ని విభాగాల శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దోషుల‌ను అంత‌మొందించాల‌న్న తీరులో వారి డిమాండ్లు ఉండ‌డం చూస్తుంటే ప‌రిస్థితులు ఎలా మార‌నున్నాయ‌నే ఆందోళ‌న వ్య‌క్తమవుతోంది. సాక్షాత్తూ ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మ‌య్ స్పందిస్తూ ''ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌ర‌హా చ‌ట్టాలను అమ‌లు చేస్తాం'' ''పరిస్థితులు డిమాండ్ చేస్తే కర్నాటకలో యోగి మోడల్ సర్కార్ నడిపిస్తాం'' అని ప్ర‌క‌టించారు. దీన్ని బట్టి కర్నాటక మరో ఉత్తరప్రదేశ్ కానుందా అనే ఆందోళనలు మొదలయ్యాయి.

ఈ నెల 26వ తేదీన బిజెపి అనుబంధ సంస్థ భార‌తీయ యువ మెర్చా(బిజెవైఎం) కార్య‌క‌ర్త ప్ర‌వీణ్ నెట్టూరు హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ యేడాది ఫిబ్ర‌వ‌రిలో హ‌ర్ష అనే కార్య‌క‌ర్త హ‌త్య‌కుగురయ్యాడు. తాజాగా ప్ర‌వీణ్ హ‌త్య నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఐటి, సోష‌ల్ మీడియా విభాగంలో ప‌నిచేస్తున్న వారంతా నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ రాజీనామాలు చేశారు. ప్ర‌భుత్వం నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ విభాగంలో దాదాపు 3300 మంది ప‌నిచేస్తూ పార్టీ ఆలోచ‌న‌ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల్లోకి నిత్యం తీసుకెళుతుంటారు. ప్ర‌వీణ్ హ‌త్య త‌ర్వాత వీరంతా రోడ్లెక్కి నిర‌స‌న‌లు వ్య‌క్తంచేస్తున్నారు.

బిజెపి, యువమోర్చాతో సహా దాని అనుబంధ సంస్థలు ,శ్రీరామ్ సేన, హిందూ జనజాగృతి సమితి వంటి ఇతర మితవాద సంస్థలు అన్నీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) ప్ర‌వీణ్ హత్యకు పాల్పడింద‌ని ఆరోపించాయి. అయితే పిఎఫ్ఐ ఈ ఆరోపణలను ఖండించింది. శాంతిని కాపాడాలని దాని కేడర్‌ను కోరింది.

ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌గ‌లం ..?

'మేము (ఐటీ సెల్) బీజేపీకి ముఖచిత్రంలా నిలుస్తూ .. బీజేపీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ళేలా ప‌నిచేస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాం..' అంటూ గత రెండు సంవత్సరాలుగా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా ఉన్నసందీప్ పాటిల్ అన్నారు. బ‌స‌వ‌రాజ్ బొమ్మ‌య్ ముఖ్య‌మంత్రి అయిన యేడాదిలోనే పార్టీకి చెందిన ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు హ‌త్య‌కు గుర‌య్యారంటే పార్టీ త‌ర‌పున తాము ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌గ‌ల‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్ర‌, రాష్ట్రాల‌లోఅధికారంలో ఉన్నప్పుడే ఇంత దారుణ హ‌త్యలు జ‌ర‌గ‌డంతో పార్టీ కార్య‌క‌ర్త‌లంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నార‌ని పాటిల్ అన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఇది కొన‌సాగ‌కూడ‌దు. క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు, చ‌ర్య‌లు తీసుకోవాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ హ‌త్య కేసుల‌ను ఎన్ఐఎతో ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించ‌డంతో పాటు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బుల్డోజ‌ర్ల‌తో పెక‌లించిన‌ట్టు నిందితుల ఆస్తులను పెక‌లించాల‌ని కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేస్తున్నారు.

అధికార బీజేపీ సమర్థతపై అవిశ్వాసం ఎందుకు?

అంత‌కు ముందు ఫిబ్రవరి 20న జ‌రిగిన శివమొగ్గకు చెందిన హ‌ర్ష అనే బజరంగ్ దళ్ యువనేత హ‌త్య‌కేసులో ద‌ర్యాప్తు పై పార్టీ శ్రేణులు సంతృప్తిగాలేవు. ఈ కేసులో 10 మంది ముస్లిం యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటన‌ గ్యాంగ్ వార్-సంబంధిత హత్యగా భావిస్తున్నారు పోలీసులు.

పిఎఫ్‌ఐ నిధులు సమకూర్చిఈ హత్య చేయించింద‌ని మితవాద సంస్థలు , బిజెపి ఆరోపిస్తుండ‌గా, రాష్ట్ర పోలీసులు మాత్రం నిందితులకు పిఎఫ్‌ఐకి మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేద‌ని చెబుతున్నాయి. అయినా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితులు "ఖైదులో ఆనందంగా గ‌డుపుతున్నారు అని బీజేపీ క్యాడర్ భావిస్తోంది. "హర్ష హంతకులు జైలు లోపల నుండి వీడియో కాల్స్ చేస్తూ కనిపించారు. ఇక‌ న్యాయం ఎక్కడుంది?" అని బీజేవైఎం కార్యకర్త ఒక‌రు ప్రశ్నించారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విధించిన ఆంక్ష‌లు, తీసుకుంటున్న చ‌ర్యలు కర్నాటక‌లో లేక‌పోవ‌డం కూడా అసంతృప్తికి ప్రధాన కారణం. చ‌ట్టం మేర‌కు స‌మ‌ర్ధ‌నీయం కాక‌పోయిన‌ప్ప‌టికీ యూపీలో, ముస్లిం నిరసనకారుల ఇళ్లను బుల్‌డోజర్‌లను ఉపయోగించి ధ్వంసం చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని బీజేపీ క్యాడర్ కూడా అదే తరహాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

యూపీలో ఇలాంటి దోషుల పట్ల సరైన రీతిలో వ్యవహరించారు.. కర్ణాటకలో కూడా అలాగే ఎందుకు జరగకూడదు? అని ఓ బీజేపీ కార్యకర్త ప్రశ్నించారు."మేము సంతోషంగా లేము. హంతకులను మాకు అప్పగించండి" అని ఒక బిజెపి కార్యకర్త అన్నారు.

ఇటువంటి ఉద్రేక‌పూరిత వాతావ‌ర‌ణంలో ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందోన‌ని ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఈ మంట‌ల నుంచే చ‌లికాచుకుంటూ వ‌చ్చే యోడాది జ‌రిగే ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకును సమీక‌రించి ల‌బ్ధిపొందాల‌ని బిజెపి చూస్తోంద‌ని విమ‌ర్శించే వారు కూడా లేక‌పోలేదు.

First Published:  29 July 2022 12:08 PM IST
Next Story