కర్నాటకలో హిజాబ్ ధారణపై నిషేధం ఎత్తివేత
మహిళలు హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు.. ఏం తింటారు.. అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు.
కర్నాటక ప్రభుత్వం మహిళలు హిజాబ్ ధరించడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. కర్నాటక ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని మైసూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు ఉండవని, నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని స్పష్టంచేశారు.
మహిళలు హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు.. ఏం తింటారు.. అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు. మీ ఇష్టాయిష్టాలను మేము ఎందుకు అడ్డుకోవాలని ఆయన ప్రశ్నించారు. మీ ఇష్టం మేరకు.. మీకు నచ్చిన విధంగా హిజాబ్ ధరించవచ్చని మహిళలనుద్దేశించి అన్నారు.
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె హిజాబ్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరిగా ధరించాలన్న నియమం ఏమీ లేదని పేర్కొంది. విద్యా సంస్థల్లో ఏక రూప దుస్తులు ధరించాలని హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.