కర్నాటకలో కమీషన్ రాజ్.. కలకలం రేపుతున్న వాట్సప్ ఆడియోలు
బీజేపీ నేతల అవినీతి బండారాన్ని బయటపెట్టేందుకు ఓ పథకం ప్రకారం వాట్సప్ ఆడియోలను రికార్డ్ చేశారు కాంట్రాక్టర్లు. వాటిని మీడియాకు విడుదల చేశారు, బీజేపీని బజారుకీడ్చారు.
కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం దాదాపుగా అన్నిచోట్లా జరిగేదే. అయితే కాంట్రాక్ట్ పని కూడా జరగని స్థాయిలో కమీషన్లు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, వేధింపులకు గురి చేయడం, చివరకు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడటం, ఆఖరికి సామాన్యులకు అవసరమైన పనులకు కూడా కమీషన్లు అడగడం.. వంటివి కర్నాటకలోనే కనపడుతున్నాయి. అందుకే కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని కమీషన్ సర్కార్ అంటున్నారు. ఈ కమీషన్ రాజ్ తో కాంట్రాక్టర్లు హడలెత్తిపోయారు. బీజేపీ నేతల అవినీతి బండారాన్ని బయటపెట్టేందుకు ఓ పథకం ప్రకారం వాట్సప్ ఆడియోలను రికార్డ్ చేశారు కాంట్రాక్టర్లు. వాటిని మీడియాకు విడుదల చేశారు, బీజేపీని బజారుకీడ్చారు.
కరోనాలోనూ కక్కుర్తి..
కమీషన్ కోసం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వేధింపులను తట్టుకోలేక కర్నాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈ ఆడియోలను విడుదల చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించింది. కమీషన్ వ్యవహారంలో 14 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులు ఉన్నట్టు పేర్కొన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ద్వారా బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 2019 నుంచి విడతల వారీగా తిప్పారెడ్డి ముడుపులు తీసుకున్నట్టు తెలిపారు. ఆస్పత్రి నిర్మాణ పనులకు 20 లక్షల రూపాయలు, పీడబ్ల్యూడీ పనులకు రూ.12.5 లక్షలు, కొవిడ్ సమయంలో మాస్క్ లు, ఇతర సామగ్రి సరఫరాలో సమయంలో రూ.10 లక్షలు, సెకండ్ వేవ్ సమయంలో రూ.12 లక్షలు చెల్లించినట్టు ఓ కాంట్రాక్టర్ వివరించారు. ఇప్పుడాయన కొత్త పనులకు ఏకంగా 30 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో పనులు చేయలేక చివరకు మీడియా ముందుకొచ్చామని వివరించారు.
25వేలమందితో భారీ ప్రదర్శన..
కొంతమంది అధికార పార్టీ నేతలు ఇటీవల 40శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కోటి రూపాయల కాంట్రాక్ట్ పనికి మంత్రికి 40 లక్షలు కమీషన్ ఇస్తే, కాంట్రాక్టర్ లాభం పోగా.. మిగతా డబ్బుతో ఆ పని చేపట్టాల్సి ఉంటుంది. నాసిరకం నిర్మాణాలకు కూడా మిగతా డబ్బులు సరిపోవు. అంటే కర్నాటకలో పూర్తిగా వ్యవస్థ నాశనం అయిపోయిందనే చెప్పాలి. దీనికి వ్యతిరేకంగా ఈనెల 18న కర్నాటకలో కాంట్రాక్టర్లంతా భారీ నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నారు. 25వేల మంది కాంట్రాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు అధికార పార్టీ నేతలు 40 శాతం కమీషన్ డిమాండ్ చేయడం అన్యాయం అని, ఇప్పటికే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, తమ కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నాటక కాంట్రాక్టర్లు.