ఖాతాదారుల సొమ్ముతో పేకాట.. - బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. రూ.2.36 కోట్లు మాయం
ఇటీవల నిర్వహించిన బ్యాంకు ఆడిట్‌లో ఈ విషయం వెలుగు చూసింది. మొత్తం రూ.2.36 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు ఆడిట్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
అతనో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్. సరదాగా మొదలుపెట్టిన ఆన్‌లైన్ రమ్మీ వ్యసనంగా మారింది. తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడుతూ.. అందుకోసం బ్యాంకు ఖాతాదారుల డబ్బును వినియోగించాడు. మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహితుడి ఖాతాకు బదిలీ చేసి.. వాటితో ఈ నిర్వాకం చేశాడు. ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..
అతని పేరు వీరేశ్ కేషిమఠ్ (28). కర్నాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజూ రూ.5 లక్షలు బదిలీ చేసే అధికారం అతనికి ఉంటుంది. రమ్మీ మత్తులో కూరుకుపోయిన అతను డబ్బు కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఎప్పటికైనా ఈ విషయం బయటపడిపోతుందనే కనీస భయం కూడా లేకుండా జూదం మత్తులో మునిగిపోయి ఖాతాదారుల సొమ్ము వాడేశాడు. ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5 లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పి హీరేమఠ్‌కు బదిలీ చేసేవాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇదేవిధంగా చేస్తున్నాడు. కొన్ని నెలల పాటు బ్యాంకు అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించలేదు.
ఇటీవల నిర్వహించిన బ్యాంకు ఆడిట్‌లో ఈ విషయం వెలుగు చూసింది. మొత్తం రూ.2.36 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు ఆడిట్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసిస్టెంట్ మేనేజర్ నిర్వాకం బయటపడింది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు.. మేనేజర్ ఫిర్యాదుతో కేషిమఠ్‌ను అరెస్టు చేశారు.
నిందితుడి నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును పోలీసులు సీఐడీకి బదిలీ చేశారు. ప్రస్తుతం సీఐడీ అధికారులు దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు.