Telugu Global
National

ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. అధ్యక్షుడు ఖర్గే ఇంటిలో సిద్ధరామయ్య.. ఫ్లైటెక్కనున్న డీకే

ఖర్గే ఇంటికి కర్ణాటక ఏఐసీసీ పర్యవేక్షకులు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ కూడా చేరుకున్నారు.

ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. అధ్యక్షుడు ఖర్గే ఇంటిలో సిద్ధరామయ్య.. ఫ్లైటెక్కనున్న డీకే
X

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. పార్టీని సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కలిసి గెలుపుబాట పట్టించారు. అయితే ఇప్పుడు సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠత కేవలం పార్టీలోనే కాకుండా రాష్ట్ర ప్రజల్లో కూడా ఉన్నది. ఐదేళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేసి.. అందరినీ ఒక్కతాటిపై నిలిపిన తనకు సీఎం పదవి వరిస్తుందని డీకే శివకుమార్ అంటున్నారు. మరోవైపు సీనియర్‌ని అయిన తనకే సీఎం పదవి కట్టబెట్టాలని సిద్ధరామయ్య వాదిస్తున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. అక్కడ పార్టీ అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు.

సిద్ధరామయ్య ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. ఖర్గే ఇంటికి కర్ణాటక ఏఐసీసీ పర్యవేక్షకులు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ కూడా చేరుకున్నారు. ఏఐసీసీ పర్యవేక్షకులు ఇప్పటికే గెలిచిన 135 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. ఎవరి అభిప్రాయం ఏమిటో తెలుసుకొని నివేదిక రూపొందించారు. దాదాపు 5 గంటల పాటు ఎమ్మెల్యేల అభిప్రాయాలు విన్న పర్యవేక్షకులు.. ఇక నివేదికను అధ్యక్షుడు ఖర్గేకు అందించనున్నారు.

కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తాజాగా బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు తన పుట్టిన రోజు. కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్తాను. ఈ రోజు కాస్త ఆరోగ్యం నలతగా ఉన్నది. రేపు ఢిల్లీ ఫ్లైటెక్కుతాను అని డీకే శివకుమార్ చెప్పారు. నా నాయకత్వంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నది. ఇదంతా నా ఒక్కడి కష్టమే అని డీకే శివకుమార్ చెప్పారు. నేను కర్ణాటకను గెలిపిస్తానని మాటిచ్చాను. అదే విధంగా మాట నిలబెట్టుకున్నాను. ఇక తుది నిర్ణయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీని అందరూ వీడిపోతున్న సమయంలో నేను ఒక్కడినే గట్టిగా నిలబడ్డాను. గత ఐదేళ్లలో ఏం జరిగిందో నేను ఇప్పుడు చెప్పను. కానీ తప్పకుండా భవిష్యత్‌లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను. అక్కడ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాను. అయితే కర్ణాటకలో నేను చేసిన కష్టం ఏమిటో పార్టీ అధిష్టానం గుర్తిస్తే చాలని శివకుమార్ భావోద్వేగంతో తెలిపారు.

కాగా, కర్ణాటక మరో రాజస్థాన్‌లా తయారు కావొద్దని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అక్కడ సీనియర్ అయిన అశోక్ గెహ్లోట్, యువ నాయకుడు సచిన్ పైలెట్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఒకానొక సమయంలో రాజస్థాన్ అధికారం చేజారుతుందని అందరూ భావించారు. కానీ అధిష్టానం కలుగజేసుకోవడంతో ప్రస్తుతం సమస్య సద్దుమణిగింది. భవిష్యత్‌లో కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి ఏర్పడ వద్దని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. కష్టపడి తెచ్చుకున్న అధికారాన్ని.. పార్టీలోని విభేదాల కారణంగా పోగొట్టుకోవద్దని ఆశిస్తున్నారు.

First Published:  15 May 2023 5:52 PM IST
Next Story