Telugu Global
National

కర్నాటకలో కష్టకాలం.. యెడ్డీవైపే మొగ్గు చూపుతున్న అధిష్టానం

బొమ్మై బొమ్మ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే సాహసం అధిష్టానం చేయట్లేదు. 80ఏళ్ల యడ్యూరప్ప నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటోంది. ఆయన్ను పోస్టర్ బాయ్ గా తెరపైకి తేవాలనుకుంటున్నారు.

కర్నాటకలో కష్టకాలం.. యెడ్డీవైపే మొగ్గు చూపుతున్న అధిష్టానం
X

ప్రతిపక్షాలను చీల్చి ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం కర్నాటకలో కొనసాగుతోంది. ఈ ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కమీషన్ రాజ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే దఫా బీజేపీకి ఒంటరిగానే కాదు, కనీసం కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండదని అంటున్నారు స్థానికులు. ఈ దశలో దక్షిణాదిన పట్టు నిలబెట్టుకోడానికి కర్నాటకలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ అధిష్టానం చెమటోడుస్తోంది. అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో ప్రధానమైనది యెడ్డీ పునరాగమనం.

మాజీ సీఎం యడ్యూరప్పపై వస్తున్న అవినీతి ఆరోపణలను తట్టుకోలేక ఆయన్ను తొలగించి బసవరాజ్ బొమ్మైని ఆ పీఠంపై కూర్చోబెట్టినా కర్నాటకలో ఫలితం కనిపించడం లేదు. ఇప్పుడు నేరుగా ఎమ్మల్యేలే బరితెగించిపోతున్నారు. 40శాతం కమీషన్లు కావాలంటూ కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు. యెడ్డీ సీటు దిగాక బీజేపీ పరువు మరింతగా మంటగలిసిపోయింది. ఈ దశలో బొమ్మై బొమ్మ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే సాహసం అధిష్టానం చేయట్లేదు. 80ఏళ్ల యడ్యూరప్ప నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటోంది. ఆయన్ను పోస్టర్ బాయ్ గా తెరపైకి తేవాలనుకుంటున్నారు. తాను ఇకపై ఎన్నికల్ల పోటీ చేయబోను అంటూ ఆమధ్య అలకబూనిన యడ్యూరప్ప అధిష్టానం ప్రోత్సహిస్తే ఏమాత్రం వెనక్కు తగ్గరనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్నికల్లో బొమ్మైని పక్కనపెట్టి యడ్యూరప్పను కర్నాటకలో ఫేస్ ఆఫ్ బీజేపీగా ముందుకు తేబోతోంది అధిష్టానం.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభలు, సమావేశాల్లో ప్రధాని మోదీతో, హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ యడ్యూరప్పపై ప్రశంసలు కురిపించడం వెనుక కారణం ఇదేనంటున్నారు విశ్లేషకులు. ఈనెల 12న మరోసారి ప్రధాని మోదీ కర్నాటకు రాబోతున్నారు. మండ్య జిల్లా మద్దూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభతో వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు.

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సమర్థంగా ఎదుర్కోవడం, లింగాయత్‌ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంతోపాటు అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌ ను కట్టడి చేసేందుకు యడ్యూరప్ప అవసరం ఉందని అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి మరో ప్రత్యామ్నాయం కూడా లేకపోవడంతో అయిష్టంగానే యడ్యూరప్పను తెరపైకి తెస్తున్నారు. తనతో అవసరం ఉండి తన దగ్గరకే వస్తున్న అధిష్టానానికి కొడుకు రూపంలో యడ్యూరప్ప కండిషన్లు పెట్టే అవకాశం కూడా ఉంది.

First Published:  6 March 2023 8:07 AM IST
Next Story