ఫుల్ టైమ్ సీఎం సిద్ధరామయ్యే.. - రచ్చ రేపిన కర్నాటక మంత్రి వ్యాఖ్య
ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ 'అధికార పంపిణీపై ఎవరేమన్నా నాకు అవసరం లేదు. ఆ విషయంపై నేనేమీ మాట్లాడను. అధికార పంపిణీ, ఇతర విషయాలపై నిర్ణయించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నేతలున్నారు.
ఓ కర్నాటక మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్య అక్కడి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ రచ్చ రేపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో దఫదఫాలుగా చర్చించడం.. ఈ విషయం కొన్ని రోజులపాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారడం తెలిసిందే. చివరికి సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేయడం, డీకేకు సింగిల్ డిప్యూటీ పదవి ఇవ్వడం, కర్నాటక పీసీసీ చీఫ్‌గా కొనసాగించడం ద్వారా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది.
ప్రమాణస్వీకారాలు కూడా అయిపోయి అంతా సద్దుమణిగిందనుకున్న వేళ కర్నాటక మంత్రి ఎం.బి.పాటిల్ సోమవారం రాత్రి చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 'ఐదేళ్ల వరకు కూడా సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు` అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
దీనిపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ 'అధికార పంపిణీపై ఎవరేమన్నా నాకు అవసరం లేదు. ఆ విషయంపై నేనేమీ మాట్లాడను. అధికార పంపిణీ, ఇతర విషయాలపై నిర్ణయించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నేతలున్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం' అని వివరించారు.
ఈ అంశంపై ఎంపీ, డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ మాట్లాడుతూ 'అది ఇప్పుడు చర్చించే అంశం కాదు. అది ఏఐసీసీ స్థాయిలో చర్చించే అంశం' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండగా, మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే ఢిల్లీకి వెళ్లనున్నారు. విస్తరణపై ఏఐసీసీ నేతలతో చర్చించనున్నారు.