Telugu Global
National

మా ప్రభుత్వానిది మూన్నాళ్ళ ముచ్చటే.. వివాదం రేపిన కర్ణాటక మంత్రి ఆడియో క్లిప్

తన‌ స్వంత ప్రభుత్వంపై ఆ ప్రభుత్వంలోని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్నాటకలో కలకలం సృష్టిస్తున్నాయి. మా సర్కార్ కేవలం నామమాత్రంగా పని చేస్తోంది. నిజం చెప్పాలంటే అసలు పని చేయడంలేదనుకోవచ్చు అని కర్నాటక న్యాయ శాఖ మంత్రి జె.సి. మధుస్వామి వ్యాఖ్యానించారు.

మా ప్రభుత్వానిది మూన్నాళ్ళ ముచ్చటే.. వివాదం రేపిన కర్ణాటక మంత్రి ఆడియో క్లిప్
X

కర్ణాటకలో సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వానికి 'అసమ్మతి మంత్రుల' పరోక్ష 'శాపనార్థాలు' తగులుతున్నాయి. అధికారంలో ఉండగానే ఇక దీనికి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా న్యాయ శాఖ మంత్రి జె.సి. మధుస్వామి చేసిన వ్యాఖ్యల తాలూకు ఆడియో క్లిప్ ఒకటి బయటపడి వైరల్ అవుతోంది. ఈ రాష్ట్ర ఎన్నికలు జరగడానికి కేవలం ఏడెనిమిది నెలలు మాత్రమే ఉంది. అందుకే ప్రభుత్వం పని చేయడం లేదు అని ఆయన అన్న మాటలపై బొమ్మై విధేయులు మండిపడుతున్నారు. రుణ మాఫీకి సంబంధించిన పత్రాలను రెన్యువల్ చేయించుకోదలచిన తమ నుంచి బ్యాంకు అధికారులు 1300 రూపాయల లంచం అడుగుతున్నారంటూ ఓ సామాజిక కార్యకర్త చేసిన ఆరోపణకు మంత్రి మధుస్వామినుంచి వచ్చిన స్పందన ఇది. తన సమస్యను ఆ సోషల్ వర్కర్ ఫోన్ లో ఈ మంత్రి దృష్టికి తేగా.. ఆయన.. బొమ్మై సర్కార్ కేవలం నామమాత్రంగా పని చేస్తోందన్నారు. అసలు పని చేయడంలేదనుకోవచ్చు అని కూడా వ్యాఖ్యానించారు. ఇది ఆపద్ధర్మ ప్రభుత్వమని చెప్పేశారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆట్టే సమయం లేదన్న మధుస్వామి కామెంట్లు కర్ణాటక రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. రైతుల నుంచి 50 వేల రుణ మాఫీకి సంబంధించిన డాక్యుమెంట్ల రెన్యువల్ కోసం బ్యాంకు అధికారులు 1300 రూపాయల లంచం కోరుతున్నారు.. మీరే ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని భాస్కర్ అనే ఈ సామాజిక కార్యకర్త కోరినప్పుడు.. నేనేం చేయాలి.. నాకివన్నీ తెలుసు..అని మంత్రిగారు చేతులెత్తేశారు. ఈ విషయాన్ని తన సహచర మంత్రి సోమశేఖర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయిందని, అయినా ఈ సర్కార్ అధికారంలో ఉండేది కొన్నాళ్లేనని మధుస్వామి విరక్తిగా మాట్లాడారు. ఈ ఆడియో క్లిప్ పై మరో మంత్రి.. మునిరత్న స్పందిస్తూ.. ఇలాంటి కామెంట్లు చేసినందుకు మధుస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మినిస్టర్ ప్రభుత్వంలో భాగమేనని, అలాంటిది సర్కార్ కి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఈ వ్యక్తి ... కేబినెట్ సమావేశాలు తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామి కాదా..అన్నారాయన.. ఇలాంటి ప్రకటనలు చేయడం తప్పని, మధుస్వామి రాజీనామా చేయాలని తాము కోరుతున్నామని మునిరత్న అన్నారు. అసలే సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం కాస్త అటూ ఇటూగా ఉన్న సమయంలో మధుస్వామి రేపిన కాక.. పరిస్థితిని ఇంకా కష్టాల్లోకి నెట్టేలా చేస్తోందన్న కామెంట్లు వినబడుతున్నాయి. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయినా అప్పుడే ఓ మంత్రి ఇలా 'బాంబు' పేల్చడం విశేషం.





First Published:  16 Aug 2022 12:27 PM IST
Next Story