Telugu Global
National

పైశాచికం : స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగాడు

వ్యాపార విషయాల గురించి మాట్లాడాలని మారేష్ ని సిద్ధాపుర క్రాస్ రోడ్స్ కు రావాలని విజయ్ పిలిచాడు. దీంతో మారేష్ అక్కడికి వచ్చాడు. తన భార్యతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ..? మారేష్ ని విజయ్ నిలదీశాడు.

పైశాచికం : స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగాడు
X

తన భార్యతో స్నేహితుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అనుమానించిన ఓ వ్యక్తి స్నేహితుడి గొంతు కోశాడు. అంతటితో అతడి ఆగకుండా స్నేహితుడి గొంతు నుంచి కారుతున్న రక్తాన్ని తాగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన విజయ్, చేలూరుకు చెందిన మారేష్ వ్యాపార భాగస్వాములు. వారిద్దరూ కలసి చింతామణిలో వస్త్రాలు, గాజులు అమ్ముతుంటారు.

అయితే మారేష్ తన భార్యతో సన్నిహితంగా మాట్లాడుతుండటంతో విజయ్ కి అనుమానం వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని విజయ్ అనుమానించాడు. నమ్మకంగా ఉంటూ ద్రోహం తలపెట్టిన మారేష్ ని చంపాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. మరో స్నేహితుడు జాన్ బాబుతో కలసి కుట్ర పన్నాడు.

వ్యాపార విషయాల గురించి మాట్లాడాలని మారేష్ ని సిద్ధాపుర క్రాస్ రోడ్స్ కు రావాలని విజయ్ పిలిచాడు. దీంతో మారేష్ అక్కడికి వచ్చాడు. తన భార్యతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ..? మారేష్ ని విజయ్ నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత విజయ్ ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న బ్లేడుతో మారేష్ గొంతు కోశాడు. ఇష్టానుసారంగా దాడి చేశాడు.

మారేష్ గొంతు నుంచి రక్తం కారుతుండగా విజయ్ తన తలని మారేష్ గొంతు వద్ద పెట్టి నేరుగా రక్తాన్ని తాగాడు. అయితే విజయ్ మారేష్ పై దాడి చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి జాన్ బాబు మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ ఘటన తర్వాత జాన్ బాబు విజయ్ ప్రవర్తన గురించి చెప్పేందుకు ఈ వీడియోను పలువురికి చూపించాడు. అది చివరికి సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా.. వైరల్ గా మారింది.

స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగుతున్న వ్యక్తిని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఇంత పైశాచికంగా ప్రవర్తిస్తారా..? వీడు మనిషేనా..? అని విస్తుపోతున్నారు. కాగా విజయ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మారేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

First Published:  26 Jun 2023 6:07 PM IST
Next Story