సోదరిని సరస్సులోకి తోసేసిన సోదరుడు.. కాపాడే ప్రయత్నంలో తల్లి మృతి
సోదరుడి హెచ్చరికలను ధనుశ్రీ పట్టించుకోలేదు. ముస్లిం యువకుడితో తన సంబంధాన్ని కొనసాగించింది. దీంతో సోదరిని చంపేయాలని నితిన్ నిర్ణయించుకున్నాడు.
తన సోదరి వేరే మతానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందన్న కోపంతో సోదరుడు ఆమెను సరస్సులో తోసి చంపాడు. కూతురిని కాపాడేందుకోసం సరస్సులోకి దూకిన తల్లి కూడా నీటిలో మునిగి చనిపోయింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలో జరిగింది.
మైసూర్ కు చెందిన అనిత(43)కు కుమారుడు నితిన్, కుమార్తె ధనుశ్రీ (18) ఉన్నారు. ధనుశ్రీ ఇటీవల ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఓ యువకుడికి దగ్గర అయింది. అతడితో సంబంధాన్ని పెట్టుకుంది. బురఖా కూడా ధరించడం మొదలుపెట్టింది. అయితే ఈ విషయం సోదరుడు నితిన్ కు తెలిసింది. దీంతో అతడు ధనుశ్రీని మందలించాడు. మరొక కమ్యూనిటీకి చెందిన వ్యక్తితో ప్రేమ వద్దని, అతడికి దూరంగా ఉండాలని సూచించాడు.
అయితే సోదరుడి హెచ్చరికలను ధనుశ్రీ పట్టించుకోలేదు. ముస్లిం యువకుడితో తన సంబంధాన్ని కొనసాగించింది. దీంతో సోదరిని చంపేయాలని నితిన్ నిర్ణయించుకున్నాడు. మంగళవారం మైసూర్ లోని హున్ సూర్ సమీప మరూర్ దగ్గర ఉండే సరస్సు వద్దకు ధనుశ్రీని పిలిపించాడు.
అయితే ఆమె వెంట తల్లి అనిత కూడా వచ్చింది. అక్కడ సోదరుడు సోదరి మధ్య ప్రేమ విషయమై గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన నితిన్ ధనుశ్రీని సరస్సులోకి తోసేశాడు. కుమార్తెను కాపాడడానికి అనిత కూడా వెంటనే నీటిలో దూకింది. చివరికి తల్లి కుమార్తె ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న మైసూర్ పోలీసులు నితిన్ ను అరెస్టు చేశారు.