సుప్రీం కోర్టులో మళ్ళీ మొదటికొచ్చిన హిజాబ్ కేసు... ఇద్దరు జడ్జీలు, విరుద్ద తీర్పులు
హిజాబ్ బ్యాన్ అంశంపై సుప్రీం కోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు రెండు విభిన్న తీర్పులిచ్చారు. ఒకరు విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్ ను సమర్దించగా, మరొకరు వ్యతిరేకించారు.
కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధం కేసులో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాల తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు రెండు వేరు వేరు తీర్పులిచ్చింది. దాంతో కేసు మళ్ళీ ఛీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళింది.
విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కర్నాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్దించగా, జస్టిస్ సుధాన్షు ధులియా వ్యతిరేకించారు.
"మాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి" అని జస్టిస్ హేమంత్ గుప్తా అన్నారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.
" నా మనస్సులో ఉన్నతమైనది ఆడపిల్లల విద్య. నా సోదర న్యాయమూర్తితో నేను గౌరవంగా విభేదిస్తున్నాను" అని జస్టిస్ ధులియా అన్నారు.
ఇప్పుడీ కేసు మరో బెంచ్ కు గానీ, రాజ్యాంగ ధర్మాసనం ముందుకు గానీ వెళ్ళే అవకాశం ఉంది.