Telugu Global
National

భవానీ రేవణ్ణకు షరతులతో కూడిన బెయిల్‌

రేవణ్ణ ఇంటి పనిమనిషి అపహరణ వ్యవహారంలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో భవానీని విచారించేందుకు సిట్‌ అధికారులు ఇటీవల నోటీసులు పంపారు.

భవానీ రేవణ్ణకు షరతులతో కూడిన బెయిల్‌
X

మహిళలపై లైంగిక దౌర్జన్యం, బ్లాక్‌మెయిల్‌ ఆరోపణలతో హసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై కేసు నమోదవడం, ఆయన అరెస్టయి బెయిల్‌పై విడుదల కావడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కిడ్నాప్‌ వ్యవహారంలో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణ పైనా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో శుక్రవారం ఆమెకు కర్నాటక హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం ఆమె సిట్‌ ముందు హాజరయ్యారు.

రేవణ్ణ ఇంటి పనిమనిషి అపహరణ వ్యవహారంలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో భవానీని విచారించేందుకు సిట్‌ అధికారులు ఇటీవల నోటీసులు పంపారు. అనంతరం విచారణ నిమిత్తం హళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా ఆమె అక్కడ లేరు. దీంతో ఆమె పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకోగా శుక్రవారం మంజూరైంది.

ఇక మైసూరు జిల్లాలోని కేఆర్‌ నగర్‌ తాలూకా పరిధితో పాటు ఆ మహిళ కిడ్నాప్‌ జరిగినట్టు భావిస్తున్న హసన్‌ జిల్లా పరిధిలోకి భవానీని ప్రవేశించకుండా హైకోర్టు నిషేధం విధించింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో రేవణ్ణను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా.. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. మరోవైపు మహిళ కిడ్నాప్‌ కేసులో భవానీ కారు డ్రైవర్‌ని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

First Published:  8 Jun 2024 3:07 AM GMT
Next Story