ట్విట్టర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు
ట్విట్టర్ వేసిన పిటీషన్‌కు ఎటువంటి అర్హత లేనందున దాన్ని కొట్టివేస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో సదరు సంస్థకు రూ.50 లక్షల జరిమానా విధిస్తున్నామని పేర్కొంది.
ట్విట్టర్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటీషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ట్విట్టర్ చేసిన అభ్యర్థనకు ఎటువంటి అర్హత లేదని పేర్కొంటూ ఆ సంస్థకు రూ.50 లక్షల జరిమానా విధించింది. జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది.
సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకర కామెంట్లను నిరోధించాలని, వాటిని తొలగించాలని పేర్కొంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ గత ఏడాది జూలైలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేంద్రం ఆదేశాలు ఏకపక్షంగా, వాక్ స్వాతంత్య్రానికి, భావప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది.
దీనిపై విచారణ అనంతరం శుక్రవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. ట్విట్టర్ అకౌంట్లు, ట్వీట్లను బ్లాక్ చేసే అధికారం తమకు ఉందని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనతో ఏకీభవిస్తున్నామని పేర్కొంది. అదే సమయంలో ట్విట్టర్ వేసిన పిటీషన్‌కు ఎటువంటి అర్హత లేనందున దాన్ని కొట్టివేస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో సదరు సంస్థకు రూ.50 లక్షల జరిమానా విధిస్తున్నామని పేర్కొంది. వాటిని 45 రోజుల్లోగా కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని, ఆలస్యమైతే రోజుకు రూ.5 వేల చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తీర్పు చెప్పింది.