Telugu Global
National

కర్నాటకలో మోడీ చేసిన ఒక్క‌ ప్రారంభోత్సవానికి అయిన ఖర్చు 9.49 కోట్ల రూపాయలు

ఈ కార్యక్రమంలో రెండు లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు, వీరందరికీ ఆహారం, రవాణా సౌకర్యాలు అందించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తదితరులు పాల్గొన్నారు.

కర్నాటకలో మోడీ చేసిన ఒక్క‌ ప్రారంభోత్సవానికి అయిన ఖర్చు 9.49 కోట్ల రూపాయలు
X

కర్నాటకలోని బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఐఐటి-ధార్వాడ్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం 9.49 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మార్చి 12న జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, భోజనాలు, వేదికల సెటప్‌లు, బ్రాండింగ్, ప్రమోషన్లు, ఇతర లాజిస్టిక్‌ల కోసం ప్రభుత్వం ఈ డబ్బు ఖర్చు చేసింద‌ని బహిర్గతమైంది. జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు గురురాజ్ హున్సాహిమరాద్ ఆర్ టీ ఐ కింద అప్లై చేయగా ఈ సమాచారం తెలిసింది.

ధార్వాడ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ను ప్రారంభించడంతో పాటు, కర్ణాటక అంతటా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో రెండు లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు, వీరందరికీ ఆహారం, రవాణా సౌకర్యాలు అందించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తదితరులు పాల్గొన్నారు.

ఆర్ టీఐ కింద అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ప్రజలను ఈ కార్యక్రమానికి తీసుకరావడానికి, తిరిగి వెనుకకు తరలించడానికి KSRTC బస్సులకు రూ. 2.83 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనం అందించేందుకు రూ.86 లక్షలు ఖర్చు చేశారు. సౌండ్, ఎల్‌ఈడీ లైటింగ్, సీసీటీవీ ఇన్‌స్టాలేషన్‌లకు రూ. 40 లక్షలు, జర్మన్ టెంట్, స్టేజీ, ‘గ్రీన్ రూం’, బారికేడ్‌ల ఏర్పాటుకు దాదాపు రూ.4.68 కోట్లు ఖర్చు చేశారు.ఈవెంట్ బ్రాండింగ్ కోసం ప్రత్యేకంగా రూ.61 లక్షలు ఖర్చు చేశారు.

హున్సాహిమరాద్ IIT-ధార్వాడ్ ప్రారంభోత్సవ వేడుకపై వ్యాఖ్యానిస్తూ, “ఈ కార్యక్రమం BJP ఎన్నికల ప్రచార సమావేశంలా అనిపించింది. ఇది ప్రజా ధనం, అధికారాన్ని దుర్వినియోగం చేయడమే.'' అని అన్నారు.

“హుబ్బలి-ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం RTI కింద ఇచ్చిన సమాచారం డిప్యూటీ కమిషనర్ ఫండ్ నుండి అయిన ఖర్చు మాత్రమే. నిజానికి మా అంచనాల ప్రకారం ఈ ఈవెంట్ కు దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేశారు.ప్రైవేట్ వాహనాలను కూడా అద్దెకు తీసుకున్నారు. దాదాపు 60 వేల మందికి మధ్యాహ్న భోజనం అందించారు. కార్యక్రమానికి హాజరైన వ్యక్తికి రూ.1,000 ఇచ్చారు.'' అని ఆయన ఆరోపించారు.

ఈ కార్యక్రమం ఒక్కటే కాదు మోడీ పాల్గొన్న ప్రతి కార్యక్రమానికి కోట్లాది రూపాయలుఖర్చు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. షిమోగాకు చెందిన ఆకాష్ పాటిల్ అనే వ్యక్తికి RTI కింద అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 27, 2023న మోడీ షిమోగా విమానాశ్రయాన్ని ప్రారంభించిన కార్యక్రమానికి ప్రజలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1,600 KSRTC బస్సులకు రూ. 3.94 కోట్లు చెల్లించిందని కన్నడ దినపత్రిక ప్రజావాణి నివేదించింది.

దీన్ని బట్టి ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాలను సందర్శించి, ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న ముదుమలై టైగర్ రిజర్వ్‌లో పర్యటించడం, హైదరాబాద్‌లో ప్రచార ర్యాలీలు నిర్వహించడం, కొత్త రైళ్లు, చెన్నైలో ప్రారంభోత్సవాలు చేయడం, బహిరంగ సభల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాలకు ఎంత ఖర్చవుతున్నదో ఊహించవచ్చు.

కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోడీ హాజరవుతున్న గ్రాండ్ ప్రారంభోత్సవ వేడుకలపై విరుచుకుపడ్డాయి. బిజెపి కోసం మోడీ ఎన్నికల ప్రచారానికి పరోక్షంగా ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.


First Published:  10 April 2023 4:35 PM IST
Next Story