Telugu Global
National

ఆ సినిమా కళ్లు తెరిపించింది.. వారికి పింఛన్ వచ్చేలా చేసింది..

తమ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన భూతకోల కళారూపానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నా.. ఆ నృత్యకారులకు ఇప్పటి వరకూ ఆర్థిక సాయం అందించలేకపోవడంపై సిగ్గుపడింది కర్నాటక ప్రభుత్వం. వెంటనే పింఛన్ పథకాన్ని అమలులోకి తెస్తూ ఆదేశాలిచ్చింది.

ఆ సినిమా కళ్లు తెరిపించింది.. వారికి పింఛన్ వచ్చేలా చేసింది..
X

"భూతకోల". ఇది ఓ సంప్రదాయ నృత్యరూపం. కర్నాటకలో దైవారాధన, భూతకోల నృత్యం చేసేవారు ఇంకా అక్కడక్కడా కనిపిస్తుంటారు. ఈ ప్రాచీన కళ ఇప్పుడు మరుగునపడిపోతోంది. దీన్ని వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నవారు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారి గురించి ఎన్నో కథనాలు మీడియాలో వచ్చాయి. భూతకోల కళాకారులను ఆదుకోవాలని, వయసుమళ్లినవారికి కనీసం పింఛన్ ఇప్పించాలని కొన్ని లక్షల అర్జీలు గతంలో కర్నాటక ప్రభుత్వానికి అందాయి. కానీ ఫలితం లేదు. కళాకారులపై ప్రభుత్వం కనికరం చూపలేదు. ఇప్పుడు వారికి టైమ్ వచ్చింది. అర్జీలతో కాని పని ఓ సినిమా చేసి పెట్టింది. "కాంతార" సినిమా ప్రభావంతో "భూతకోల" కళాకారులపై చర్చ మొదలైంది. వారికి పింఛన్ మంజూరు చేస్తూ కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మొహానికి రంగులేసుకుని, వంటినిండా పూలు కట్టుకుని, విచిత్ర వేషధారణతో నృత్యం చేస్తారు భూతకోల నృత్యకారులు. అంతకు మించి అందులో ఓ ఆధ్యాత్మిక భావన ఉంది. దీన్ని కళ్లకు కట్టినట్టు కాంతార సినిమాలో చూపించారు హీరో కమ్ దర్శకుడు రిషభ్ శెట్టి. ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. భూతకోల నృత్యకారుల ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.

దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంతార సినిమా గురించి చర్చ జరుగుతోంది. భూతకోల నృత్యకారులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీంతో కర్నాటక ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. తమ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన భూతకోల కళారూపానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నా.. ఆ నృత్యకారులకు ఇప్పటి వరకూ ఆర్థిక సాయం అందించలేకపోవడంపై సిగ్గుపడింది. అందుకే వెంటనే పింఛన్ పథకాన్ని అమలులోకి తెస్తూ ఆదేశాలిచ్చింది. 60ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు నెలకు 2వేల రూపాయలు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా నెలకు 2వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అంతరించిపోతున్న ఈ కళకు, కళాకారులకు తనవంతు ప్రోత్సాహం అందిస్తామని చెబుతున్నారు నాయకులు.

First Published:  21 Oct 2022 7:46 AM IST
Next Story