ప్రధాని మోడీ పర్యటనలో ముస్తాబులు, ముసుగులకే కోట్లాది రూపాయల ఖర్చు!
తాజాగా ప్రధాని మోడీ శుక్రవారం జరిపిన కర్ణాటక పర్యటనకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.9 కోట్లను వెచ్చించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగా ప్రధాని పర్యటించిన సమయంలో మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేయడం సాధారణమేనని ప్రభుత్వం వాదిస్తోంది.
సాధారణంగా ప్రధాన మంత్రి ఏ రాష్ట్రానికైనా పర్యటనకు వెళుతుంటే అక్కడ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయడం మామూలే. కానీ ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనలకు వెళితే అక్కడ రోడ్లు, ఆస్పత్రులు, పరిసరాల ముస్తాబులకు, కంటికి కనబడని అభివృద్ధిపై ముసుగులు వేసేందుకే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు. గుజరాత్ లో మోర్బీ లో వంతెన కూలిపోయిన సందర్భంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన ఆస్పత్రిని ముస్తాబు చేయడం, రోడ్ల పక్కన చెత్తా చెదారం, పూర్తికానీ నిర్మాణాలు కనబడకుండా వాటిపై ముసుగులు ( డేరాలు) కట్టడం గమనించాం. తాజాగా ప్రధాని మోడీ శుక్రవారం జరిపిన కర్ణాటక పర్యటనకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.9 కోట్లను వెచ్చించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ బెంగళూరులో శుక్రవారం జరిపిన పర్యటన కోసం ఆయన ప్రయాణించే మార్గాల్లో రహదారుల మరమ్మతులు, అలంకరణ కోసం బీబీఎంపీ ఏకంగా రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే ఈ ఖర్చు ఇంకా ఎక్కువే ఉంటుందని విపక్షాలు వ్యాఖ్యానించాయి. మోడీ పర్యటించిన హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్, విధానసౌధ, మెజస్టిక్, మేఖ్రి సర్కిల్‌లోని ఎయిర్‌ఫోర్స్ కేంద్రం, దేవనహళ్లి ప్రాంతాల్లో పలు రోడ్లను అప్పటికప్పుడు మరమ్మతులు చేశారు. కొన్ని రోడ్లకైతే 15 రోజుల క్రితమే తారు వేసే పనులు చేపట్టారు.
కాగా విపక్షాల విమర్శలపై మంత్రి అశోక్ స్పందిస్తూ ప్రధాని పర్యటించిన సమయంలో మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేయడం సాధారణమేనన్నారు. వీటిని కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు.